- ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు
మెదక్‌టౌన్, వెలుగు: ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు సూచించారు. సోమవారం రూ.15 లక్షల విలువైన 110 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫోన్ పోయినప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా సంబంధిత పీఎస్‌లో ఫిర్యాదు చేసి సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలను నమోదు చేయించాలని సూచించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని తెలిపారు.
సీఈఐఆర్ పోర్టల్ సాయంతో పోయిన ఫోన్లను గుర్తించడం చాలా సులభమని, ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పీఎస్‌లో సీఈఐఆర్ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. దొంగిలించిన ఫోన్లు నేరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున సీఈఐఆర్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని సూచించారు.
మొబైల్స్ రికవరీలో నైపుణ్యం ప్రదర్శించిన ఐటీ కోర్ టీమ్ కానిస్టేబుల్స్ విజయ్, వెంకట్ గౌడ్, మహేందర్ గౌడ్, వివిధ పీఎస్‌లలో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందచేసి రివార్డు ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, ఇన్స్పెక్టర్కృష్ణమూర్తి, ఐటీ కోర్, సీఈఐఆర్ పోర్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

