- తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న వైనం
- కేసులు పెడుతున్నా.. జైలుకు పోతున్నా మారని తీరు
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలందించాల్సిన పలువురు అధికారులు, ఉద్యోగులు లంచాలు ఇవ్వందే పని చేయడం లేదు. ప్రతీ నెల ఆరంకెల జీతం వస్తున్న వారు సైతం అక్రమార్జనకు అలవాటు పడి చేయిచాస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఆర్టీఏ, ఫారెస్ట్, మున్సిపల్, విద్యుత్, హెల్త్, ఎక్సైజ్, ఇంజినీరింగ్డిపార్ట్మెంట్లలో లంచం ఇవ్వకపోతే ఫైల్ముందుకు కదలని దుస్థితి నెలకొంది.
అన్నీ సవ్యంగా ఉన్నా.. ఏదో కొర్రి పెట్టి పని చేయకుండా సతాయించడం, నెలల తరబడి ఆఫీస్ ల చుట్టూ తిప్పుకోవడం అలవాటుగా మారింది. ఏసీబీ అధికారులు దాడులు చేసి, లంచం తీసుకుంటున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపుతున్నా.. లంచావతారుల తీరు మారట్లేదు. రెండేళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో అధికారులు ఏసీబీకి చిక్కారంటే ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సిద్దిపేట జిల్లాలో..
రెండేళ్లుగా సిద్దిపేట జిల్లాలో ఏసీబీ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. పలువురు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. గత నెలలో ములుగు ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్ రాజు కోర్టు నుంచి వచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్అమలులో భాగంగా పోలీస్ప్రొటెక్షన్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో ములుగు డిప్యూటీ తహసీల్దార్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికారు. ఫిబ్రవరిలో దుబ్బాక మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
గతేడాది నవంబర్‌లో గజ్వేల్ మండలంలో ఓ వీఆర్వో మ్యుటేషన్ ఫిర్యాదు పరిష్కారం కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డాడు. ఈ ఏడాది మేలో పట్టుకున్న వెహికిల్‌ను తిరిగి ఇచ్చేందుకు హోంగార్డు రూ.10 వేల తీసుకుంటూ దొరికాడు. ఆగస్టులో మద్దూరు పీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్చెక్ మెజర్ చేయడానికి రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పీఆర్, ఇరిగేషన్, విద్య తదితర శాఖల్లో టెండర్లు, సర్టిఫికెట్లు, ఫైల్ ప్రాసెసింగ్, బిల్లుల చెల్లింపులు.. తదితర అంశాల్లో డబ్బులు ముట్టజెప్పకపోతే కదలని ఫైళ్ల సంఖ్య పెరుగుతూనే ఉందన్న ఆరోపణలున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో ఏడాదిగా లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారుల వివరాలు పరిశీలిస్తే.. జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ఆఫీస్లో అక్రమాలపై ఫిర్యాదు అందడంతో ఈ నెల 14న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ఏజెంట్లను పట్టుకొని, రూ.42,300 స్వాధీనం చేసుకున్నారు. గత జులై 10న నిమ్జ్ ఆఫీస్‌పై దాడి చేసి లంచం తీసుకుంటున్న డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.65 వేలు స్వాధీనం చేసుకొని, ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. అక్టోబర్ 19న మాడ్గి ఆర్టీఏ చెక్ పోస్ట్ పై దాడి చేసి లెక్కలు చూపని రూ.43,300 స్వాధీనం చేసుకున్నారు. డ్యూటీలో ఉన్న ఏఎంవీఐ కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. కల్హేర్ మండలం మహాదేవపల్లి పంచాయతీ సెక్రటరీ ఉమేశ్నో డ్యూస్సర్టిఫికెట్ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
మెదక్ జిల్లాలో..
హార్వెస్టర్ కు సంబంధించిన బ్యాటరీ, స్పేర్ పార్ట్స్దొంగిలించిన కేసు కాంప్రమైజ్కోసం టేక్మాల్ఎస్సై రాజేశ్ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఈ నెల 18న ఏసీబీకి చిక్కాడు. గత అక్టోబర్30న ట్రాన్స్‌కో మెదక్ డివిజినల్ఇంజినీర్(డీఈ) షేర్షరీఫ్ చాంద్‌పాషా ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం ఓ పౌల్ట్రీ రైతు నుంచి రూ.21 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గతేడాది మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య ఏసీబీ అధికారులకు దొరికాడు. జిల్లాలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ట్రాన్స్ కో, సివిల్ సప్లై, హెల్త్ తదితర డిపార్ట్మెంట్లలో పైసలివ్వనిదే ఏ పనీ జరగదని పలువురు ఆరోపిస్తున్నారు.
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఫోన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్, ఆధారాలతో వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. వెంటనే అందుబాటులోకి వచ్చి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని అంటున్నారు. దీనిపై ప్రతీ గ్రామంలో యువజన, ప్రజా సంఘాల వారు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.
