ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​ పట్టణంలోని గాంధీనగర్​ వీధికి చెందిన రెండేండ్ల చిన్నారి అదీనా జహనాబ్​  గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని పార్టీ లీడర్ల ద్వారా  తెలుసుకున్న ఎమ్మెల్యే  వెంటనే స్పందించి వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్​ఎఫ్ నుంచి రూ.2 లక్షలు ఎల్​వోసీ శాంక్షన్​చేశారు. అలాగే  మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా  వైద్య ఖర్చులు, ఆపరేషన్ కోసం రూ.2 లక్షలు మంజూరు చేశారు. అనంతరం మెదక్​ పట్టణంలోని ఇందిరాపురి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట మెదక్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ బట్టి జగపతి, టీఆర్ఎస్ లీడర్లు లింగారెడ్డి, అశోక్​ తదితరులు ఉన్నారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

మెదక్ (వెల్దుర్తి), వెలుగు: మాసాయిపేట మండల కేంద్రంలో తాగునీటి ఇబ్బంది తీర్చాలంటూ ఆదివారం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. 11వ వార్డులో కొంత కాలంగా తాగునీటి సరఫరా చేస్తలేరంటూ మహిళలు వార్డు మెంబర్​ స్వప్న ఇంటి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేస్తున్నామని చెబుతుండగా తమకు మాత్రం తాగునీళ్లు అందుతలేవని వాపోయారు. అధికారులు స్పందించి  సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి(హత్నూర), వెలుగు : హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్​లో భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడి రమేశ్ తో  చౌటకూర్​మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన వెన్నెల (24) కు ఏడాది కింద పెళ్లైంది. కొంత కాలం వరకు వారిద్దరి దాంపత్య జీవితం అన్యోన్యంగానే సాగింది. అయితే గత కొన్ని నెలలుగా అభిప్రాయ బేధాలతో ఇద్దరూ గొడవ పడుతుండేవారు. రమేశ్​తరచూ భార్యను కొడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన గురైన వెన్నెల ఇంట్లోని ఫ్యాన్​కు చీరతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి యాదమ్మ కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు భరించలేక వ్యక్తి..

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: కౌడిపల్లి మండల కేంద్రంలో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దేవగౌని భిక్షపతి గౌడ్ (36) ఇటీవల కురిసిన వానలకు సొంత ఇళ్లు కూలిపోయేలా ఉండడంతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కూలీపని చేసుకునే భిక్షపతి  కొంత కాలంగా కూలీ పని దొరకక.. ఇంటి కిరాయి కట్టేందుకు, కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య స్వప్న  కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట
మహిళా కమిషన్​ చైర్ పర్సన్​ సునీతారెడ్డి

మెదక్​ (చిలప్ చెడ్),వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి అన్నారు. ఆదివారం చిలప్​చెడ్​ మండలం శీలంపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి  కొత్తగా శాంక్షన్​అయిన 553 ఆసరా పింఛన్లు, 20 కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద, లేబర్ వేల్ఫేర్​బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వామి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీ పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తాం

నారాయణ్ ఖేడ్, వెలుగు: ‘టీయూడబ్ల్యూజేహెచ్​143’తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ గౌడ్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూంలను కేటాయించేందుకు తమ యూనియన్ కృషి చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా ఆయన యూనియన్ సభ్యత్వ నమోదుపై చర్చించడంతో పాటు ఖేడ్ డివిజన్ లో తమ యూనియన్ బలంగా ఉందన్నారు. సభ్యత్వ నమోదును పూర్తి చేసి మండల, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో నారాయణఖేడ్లో డివిజన్ స్థాయి మహాసభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, జిల్లా నాయకులు పరశురామ్, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, స్థానిక బాధ్యులు అమృత్, మధుసూధన్ రెడ్డి, వెంకట్ రాములు, సంజీవ్, శ్రీకాంత్, పరమేష్, గోస్కె శ్రీనివాస్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఆయా మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.  

నల్ల పోచమ్మ తల్లికి పూజలు

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: జిల్లాలోని కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి, ఒడి బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో మోహన్‌‌రెడ్డి, ఆలయ ఇన్‌‌చార్జి వెంకట్‌‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

షీ టీమ్స్​తో మహిళలకు పూర్తి భరోసా
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

మెదక్​టౌన్, వెలుగు : జిల్లాలో షీ–టీమ్స్​తో మహిళలకు, విద్యార్థినులకు పూర్తి స్థాయి భద్రతతో  భరోసా కల్పిస్తున్నామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదివారం ఒక ప్రకటనలో  తెలిపారు.  ఎవరైనా వేధింపులకు గురైతే క్యూఆర్​ కోడ్​ ద్వారా పోలీసులకు కంప్లైంట్​చేయాలని సూచించారు. ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్​పై అవేర్​నెస్ ​ప్రోగ్రామ్స్​నిర్వహించి 3 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో  స్టూడెంట్లకు ర్యాగింగ్, ఈవ్​ టీజింగ్​, పోక్సో, యాంటీ హ్యూమెన్​ట్రాఫికింగ్​లపై షీటీమ్స్​అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయని చెప్పారు.  ఈ మేరకు క్యూఆర్ కోడ్​ స్కానింగ్​ పోస్టర్లను  జిల్లాలోని  బస్సులు, బస్టాండ్లు, సినిమా హాల్స్, స్కూళ్లు, కాలేజీలు, రద్దీ ప్రాంతాల్లో అతికించామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి వెంటనే సాయం పొందాలని ఎస్పీ  సూచించారు.  షీ–టీమ్ వాట్సాప్​నంబర్ 6303923823, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08452–223533 లకు ఫోన్ చేయాలని చెప్పారు. 

ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు

మెదక్(పెద్దశంకరంపేట), వెలుగు : రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల  తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే  భూపాల్​రెడ్డి అన్నారు. ఆదివారం పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషోర బాలికలకు రూ.10 వేల విలువజేసే పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  మండల పరిధిలో 1,100 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసే ప్రతిపక్షాల మాటలు పట్టించుకోకుండా, ప్రజలకు సేవ చేసే టీఆర్ఎస్​ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్,   టీఆర్ఎస్​మండల అధ్యక్షుడు మురళి,  సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పిల్లలను అమ్మితే..కఠిన చర్యలు

నర్సాపూర్, వెలుగు : వారం రోజుల కింద జరిగిన శిశువు విక్రయ కేసును పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారం మేరకు ఏపీలోని వైజాగ్లో ఉన్న శిశువును తీసుకొచ్చి నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత, ఐసీడీఎస్​ఆఫీసర్ల సమక్షంలో ఆదివారం శిశువును సంగారెడ్డి బాలసదనంలో అప్పగించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ శిశువుల విక్రయాలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. శిశువు విక్రయాలకు సహకరించిన వారికి జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఎస్సై గంగరాజు, ఐసీడీఎస్​ సూపర్​వైజర్ ​సరళ  పాల్గొన్నారు.