- పరిశీలించిన కలెక్టర్ దివాకర టిఎస్
తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. సోమవారం ఆర్డీఓ వెంకటేశ్ తో కలిసి మేడారంలో పర్యటించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాలను, రహదారులను, గద్దెల ప్రాంగణంలో అభివృద్ధి పనులను, రెడ్డిగూడెం అంతర్గత రహదారులను పరిశీలించారు.
పనుల పురోగతిని ఆర్డీఓ వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పాటు స్థానిక తహసీల్దార్ సురేశ్ బాబు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
