- మహాజాతర నాటికి కంప్లీట్ కానున్న పనులు
- పూర్తిగా మారిపోనున్న ఆలయ పరిసరాలు
ములుగు, తాడ్వాయి, వెలుగు : మేడారంలో కొలువైన వన దేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు స్పీడ్ గా నడుస్తున్నాయి. ఇంజినీరింగ్అధికారులు రేయింబవళ్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అమ్మవార్ల గద్దెలను మాస్టర్‌ప్లాన్ లో భాగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సెప్టెంబర్23న పనులను ప్రారంభించారు. మంత్రులు నిత్యం పర్యవేక్షిస్తూ జాతర సమయానికి పనులు పూర్తయ్యేలా అధికారులకు సూచనలు చేస్తున్నారు. మేడారం అభివృద్ధికి రూ.236.2కోట్లతో పాటు జాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనకు రూ.150కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
సమ్మక్క, సారలమ్మ గద్దెల ఎత్తు పెంపుతోపాటు చుట్టూ పాలరాతి గ్రిల్స్, అదేవిధంగా గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెలను తల్లులకు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. గద్దెల సుందరీకరణ పనులు దాదాపు చివరి దశకు చేరాయి. ఈనెల10లోపు గద్దెల ప్రాంగణం భక్తులకు అందుబాటులోకి రానుంది. మేడారం ప్రాంగణ విస్తరణ పనులు కూడా తుది దశకు చేరాయి. సాలారం లోపల పొడవు ప్రస్తుతమున్న దానికంటే మరో180 ఫీట్లు, వెడల్పు40 ఫీట్ల మేర విస్తరణ జరుగుతోంది. ఒకేసారి10వేల మంది భక్తులు ఇబ్బంది లేకుండా దర్శించుకునేలా నిర్మిస్తున్నారు. భారీ క్రేన్లతో పాలరాతి శిలలను అమర్చుతు న్నారు. రెండు రోజులుగా ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి.
మహా జాతర నాటికి..
2026 జనవరి 28 నుంచి 31వరకు మేడారం మహాజాతర జరగనుండగా, ఆ సమయానికి పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాంట్రాక్టర్ రేయింబళ్లు గద్దెల విస్తరణ, అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంజినీరింగ్అధికారులు దగ్గరుండి చేయిస్తున్నారు.
90 రోజుల్లో కంప్లీట్ చేసేందుకు ప్లాన్ రూపొందించగా ఇటీవల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క మేడారం సందర్శించారు. వచ్చే జనవరి 3వ తేదీ లోపు భక్తులు దర్శించుకునేలా గద్దెలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సంబంధిత అధికారులు పనుల పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తున్నారు.
మాస్టర్ ప్లాన్పనులతోపాటు మహాజాతరకు తరలివచ్చే భక్తులకు తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, విపత్తు నిర్వహణ బలగాలు ముందుగానే సిద్ధంగా ఉంచేందుకు సంబంధి త శాఖలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ మొదలు పెట్టారు. మేడారం వచ్చే రోడ్ల కూడా విస్తరణ కొనసాగుతోంది.
పాలరాతి శిలలపై సంస్కృతి ప్రతిబింబించేలా..
అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చే సమయంలో క్యూలైన్లపై షెడ్ల నిర్మాణంతోపాటు తాగునీటి వసతి, వృద్ధులకు బెంచీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు పాలరాతి శిలలపై చెక్కడంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం సైతం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ పనులతో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలిగించకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
