మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. అధికారుల‌‌‌‌ను ఆదేశించిన మంత్రులు సీత‌‌‌‌క్క, కొండా సురేఖ

మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..    అధికారుల‌‌‌‌ను ఆదేశించిన మంత్రులు సీత‌‌‌‌క్క, కొండా సురేఖ
  •     పనుల అంచనాలను రెడీ చేసి టెండర్లు పిలవాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: మేడారంలో అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి, వరంగ‌‌‌‌ల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచ‌‌‌‌న‌‌‌‌ల‌‌‌‌తో బుధవారం సెక్రటేరియెట్​ నుంచి మంత్రి సీతక్క, వ‌‌‌‌రంగ‌‌‌‌ల్ నుంచి మంత్రి కొండా సురేఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్, పంచాయతీ రాజ్ ఈఎన్సీ అశోక్, దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి ప్రణాళికను సీఎం ఖరారు చేయడంతోనే పనులకు కౌంట్‌‌‌‌డౌన్ ప్రారంభమైందన్నారు. 

ఇది ఒక మహాఘట్టమని, ఈ చరిత్రాత్మక పనిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. భక్తులకు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి వర్కింగ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డిజైన్స్‌‌‌‌ను వేగంగా పూర్తి చేయాలని, పనుల అంచనాలను సిద్ధం చేసి టెండర్లు పిలవాలని మంత్రులు పేర్కొన్నారు.