మేడారానికి పోటెత్తిన భక్తులు.. జాతర ముగిసినా తగ్గని రద్దీ..

మేడారానికి పోటెత్తిన భక్తులు.. జాతర ముగిసినా తగ్గని రద్దీ..

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతర ముగిసి 23 రోజులు కావస్తున్నా భక్తుల తాకిడి తగ్గడం లేదు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వన దేవతల దర్శనాల కోసం భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం సంతానం కోసం జంపన్నకు, నాగులమ్మకు ముడుపులు కట్టారు. 

కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీర సారె, నిలువెత్తు బెల్లం సమర్పించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లు, మేకలతో ఎదురు మొక్కుకొని వంటలు చేసుకొని విందు భోజనాలు చేశారు. ప్రైవేట్​ వాహనాలు భారీగా తరలిరావడంతో జంపన్న వాగు వద్ద గంట సేపు ట్రాఫిక్  జామ్  ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలో తాగునీరు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.