మంత్రులు,ఎమ్మెల్యేల బినామీలకే మేడారం కాంట్రాక్టులు !

మంత్రులు,ఎమ్మెల్యేల బినామీలకే    మేడారం కాంట్రాక్టులు !

జయశంకర్‌‌ ‌‌భూపాలపల్లి, వెలుగు: మేడారంలో ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లంతా మంత్రులు, ఎమ్మెల్యేలకు బినామీలే. తెరవెనుక నడిపిస్తున్నదంతా ప్రజాప్రతినిధులే. అందుకే ఇంజినీరింగ్‌‌‌‌శాఖ అధికారులు కామ్​గా ఉండిపోయారు. ప్రభుత్వ నిధులు విడుదలైనట్లు జీవో జారీ అయిన వెంటనే ఏయే పనులు చేపట్టాలి? ఎక్కడ చేపట్టాలి? ఎలా చేయాలి? టెండర్లు ఎలా నిర్వహించాలి? అనే విషయాలన్నింటినీ నేతలు, వారి బినామీలు దగ్గరుండి చూసుకున్నారు. మొదట నామినేషన్‌‌ విధానంలో వర్కులు విభజించి ఇవ్వాలని అప్పటి కలెక్టర్​ నారాయణరెడ్డిపై అధికార పార్టీ లీడర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కానీ కలెక్టర్‌‌‌‌అంగీకరించకపోవడంతో ప్లాన్​–1 వర్కవుట్​ కాలేదు. దీంతో ప్లాన్​ –2 కి తెరతీశారు. టెండర్ల ద్వారా తమకే వర్కులు దక్కేలా వ్యూహం పన్నారు. వర్క్‌‌‌‌అగ్రిమెంట్లు ఎవరి పేరిట ఉన్నా పనులు చేసేది, బిల్లులు తీసుకునేది మాత్రం నేతలే ఉండేలా స్కెచ్ వేసి, సక్సెస్​ అయ్యారు. ఇంజినీరింగ్‌‌‌‌శాఖ అధికారులు కూడా వారికి అన్నివిధాలా సహకరించారు. కాంట్రాక్టర్లు చెప్పినట్లే  వర్కులు తయారు చేశారు. వర్క్‌‌‌‌ఎస్టిమేట్లు పెంచి టెండర్లు పిలిచారు.

 వర్క్​ సీనియారిటీ పక్కకు పెట్టి…

పనుల పంపకానికి కలెక్టర్‌‌‌‌నారాయణరెడ్డి ఒప్పుకోకపోవడంతో ఆయనను ట్రాన్స్​ఫర్​ చేయించేందుకు నేతలు హైదరాబాద్​ లెవల్​లో పావులు కదిపారు. కానీ ఈలోపే  టెండర్లు పిలవడంతో ఆఫీసర్లను మేనేజ్​ చేశారు.  రూల్స్​ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ‘వర్క్‌‌ ‌‌సీనియారిటీ’ అనే అర్హతను కావాలనే పెట్టించారు. నిబంధనల ప్రకారం గిరిజనులకు పనులు దక్కాల్సి ఉన్నా, తాము చెప్పిన వారికే దక్కేలా చూశారు. తీరా టెండర్లలో పనులు దక్కించుకున్న వాళ్లలో ఎవరూ కూడా ప్రస్తుతం పనులు చేయడం లేదు. చాలా పనులను ప్రజాప్రతినిధులకు సన్నిహితులైన కేవలం ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే చేస్తున్నారు. జాతర దాకా తూతూ మంత్రంగా పనులు జరిపి  పెద్దమొత్తంలో నిధులు కాజేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు జంపన్నవాగులో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ అడ్రస్​ కూడా లేదు. దాని స్థానంలో రెండో టెండర్‌‌‌‌ వేసి కొట్టుడుబోయిన కాంట్రాక్టర్​ పనులు చేస్తున్నాడు. ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌ ‌‌శాఖ తరపున 400 కేఎల్‌‌ ‌‌సామర్థ్యం కలిగిన వాటర్‌‌‌‌ట్యాంక్‌‌ ‌‌నిర్మాణ పనులను టెండర్‌‌‌‌ దక్కించుకున్న సంస్థ కాకుండా మరొకరు చేస్తున్నారు. చాలా పనుల్లో ఇదే పరిస్థితి ఉంది.

మాట వినకపోతే బదిలీ వేటు

మేడారంలో కాంట్రాక్టర్లు వారి మాట వినకపోతే  ఆఫీసర్లను బదిలీ చేసే స్థాయికి ఎదిగారు. ములుగు పాత కలెక్టర్‌‌ ‌‌నారాయణరెడ్డి జాతర పనులను నామినేషన్​పై నేతలు, వారి బినామీలకు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. టెండర్లు దక్కించుకున్న వాళ్లే పనులు చేపట్టాలని, గడువులోగా పూర్తి చేయాలని, క్వాలిటీ లేకుంటే బిల్లులు చెల్లించమని హెచ్చరించారు. పనుల పరిశీలనకు జిల్లాస్థాయి అధికారులతో ఏకంగా కమిటీ వేశారు. ఇది గిట్టని లీడర్లు కలెక్టర్‌‌‌‌ను రాత్రికి రాత్రి నిజామాబాద్‌‌‌‌ బదిలీ చేయించారనే చర్చ జరిగింది.  2018లోనూ అప్పటి జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌ ‌‌మురళి ప్రభుత్వం కేటాయించిన నిధులతో పర్మినెంట్‌‌ ‌‌పనులు చేయాలని నిర్ణయించారు. దీనికి అంగీకరించని లీడర్లు ఆయన్నీ  ఆకస్మికంగా బదిలీ చేయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అన్ని పనుల్లోనూ గోల్​మాల్​

మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేయగా తొమ్మిది ఇంజనీరింగ్‌‌‌‌శాఖల తరపున పనులు చేపడుతున్నారు. ములుగు జిల్లా పాత కలెక్టర్‌‌‌‌ సీ నారాయణరెడ్డి రూ.45 కోట్లకు నవంబర్‌‌‌‌1న అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌అనుమతులు ఇచ్చారు. అన్ని శాఖల టెండర్లలోనూ గోల్‌‌‌‌మాల్‌‌‌‌జరిగిందనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా కొత్తవాళ్లను టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు.

చిన్న నీటి పారుదల శాఖ(ఐబీ) తరఫున తొమ్మిది వర్క్‌‌‌‌లు చేయడానికి రూ.3.51 కోట్లు కేటాయించారు. వీటికి వేర్వేరుగా టెండర్లు పిలవాల్సి ఉండగా ఓ ఎమ్మెల్యేకు చెందిన బినామీ సంస్థకు పనులు అప్పగించేందుకు అధికారులు అన్నింటికి కలిపి ఒకే టెండర్‌‌ పిలిచారు. అతి తక్కువ లెస్‌‌‌‌పై ఆ ఎమ్మెల్యేకు చెందిన సంస్థకే పనులు ఇచ్చేశారు.

బ్యాటరీ ఆఫ్‌‌ ‌‌ట్యాప్స్‌‌‌‌ఏర్పాటు కోసం రూ.1.2 కోట్లు ఖర్చుచేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన ట్యాప్‌‌‌‌లను బిగించడానికి ఇంత పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేయడం అనుమానాలకు తావిస్తోంది.

 బట్టలు మార్చుకునే బాత్రూంల నిర్మాణం,

జంపన్నవాగులో ఇసుక బస్తాలు నింపి బాటలు వేయడం, వాగులో ఇసుక లెవలింగ్‌‌‌‌చేయడం, స్నానాల గదుల నిర్మాణం లాంటి వేర్వేరు పనులను ఒకే  వర్క్​ కింద చూపారు.

తాగునీటి సరఫరా కోసం గతంలో మినీ వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లు కట్టారు. భూమిని తవ్వి పైప్‌‌‌‌లైన్లు వేశారు. తాజాగా తాగునీటి సరఫరాకు మరోసారి కొత్తగా వాటర్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లు కడుతున్నారు. కొత్త పైప్‌‌‌‌లైన్లు  ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.4 కోట్లకు పైగా ఖర్చు
చేస్తున్నారు.

రోడ్ల నిర్మాణం విషయంలో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ తరపున కొత్త ఎత్తులు వేశారు. ములుగు జిల్లా జంగాలపల్లి నుంచి జయశంకర్‌‌‌‌భూపాలపల్లి జిల్లా గాంధీనగర్‌‌‌‌వరకు గత జాతర సందర్భంగానే బీటీ డబుల్‌‌‌‌రోడ్డు వేశారు. ఇప్పుడు మళ్లీ ఈ రోడ్డు మరమ్మతు కోసం రూ.95 లక్షలతో పనులకు అనుమతులిచ్చారు. రోడ్డు ఒకవేళ ఎక్కడైనా పాడైతే అక్కడ గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్‌‌‌‌తోటే రిపేరు చేయించాలి. కానీ కొత్తగా నిధులివ్వడం, ఒకే పనిని 3 వేర్వేరు బిట్లుగా చూపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాడ్వాయి‒నార్లాపూర్‌‌‌‌రోడ్డు కూడా బీటీ డబుల్‌‌‌‌రోడ్డే. అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్లు అవసరం ఉన్నాయి. ఈ పనులన్నీ పాత కాంట్రాక్టర్‌‌‌‌తో చేయించాల్సినవే. కానీ ఈ రోడ్డు మరమ్మతు కోసం రూ.1.20 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నారు.

ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ, పంచాయతీరాజ్‌‌, ఎండోమెంట్‌‌‌‌‌‌శాఖల తరపున ప్యాచ్‌‌‌‌వర్క్‌‌‌‌ల పేరిట రోడ్ల మరమ్మతుల కోసం రూ.10 కోట్లకు పైగా నిధులు ఖర్చుచేస్తున్నారు.

ఇలా చెప్పుకుంటూ  ఎన్నో పనులను తూతూమంత్రంగా చేపట్టి, సగానికి పైగా నిధులను జేబులో వేసుకునేందుకు నేతలు ప్లాన్​ ప్రకారం ముందుకెళ్తున్నారు. కావాలనే పనులను ఆలస్యంగా ప్రారంభించేలా చక్రం తిప్పి, తీరా జాతర సమయంలో హడావిడిగా ముగించనున్నారు.

గిరిజనుల ఆగ్రహం

మేడారం పనులన్నీ అధికార పార్టీ లీడర్లు, వారి బినామీలకు దక్కేలా ఇంజనీరింగ్‌‌‌‌శాఖ అధికారులు ప్లాన్​ వేశారని గిరిజనులు మండి పడుతున్నారు. తమకు దక్కాల్సిన పనులను ఎస్టిమేట్లు పెంచి, అనుకున్నవారికి కట్టబెట్టారని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్టలు మార్చుకునే బాత్రూంల నిర్మాణం, జంపన్నవాగులో ఇసుక బస్తాలు నింపి బాటలు వేయడం, వాగులో ఇసుక లెవలింగ్‌‌‌‌చేయడం, స్నానాల గదుల నిర్మాణం వంటి వేర్వేరు పనులను ఒకే వర్క్‌‌‌‌కింద ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ పనులు చేయడానికి ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ కావాలనే అక్కరకు రాని నిబంధనలు పెట్టి టెండర్లలో పాల్గొనకుండా చేశారని ఆరోపిస్తున్నారు.