మేడారంలో పార్కింగ్‌ పనులు ఇట్లనేనా చేసేది!

మేడారంలో పార్కింగ్‌ పనులు ఇట్లనేనా చేసేది!

సరైన ప్లానింగ్ లేదు.. కనీస సౌకర్యాల్లేవ్

‘ఏదైనా పనిచేస్తే ప్లానింగ్ ఉండాలి.. అంతేకాని పని చేసిన తర్వాత ప్లానింగ్ చేస్తమంటే కుదరదు. మేడారం జాతర పార్కింగ్​ స్థలాల వద్ద ఇన్, అవుట్ లెట్లు ఎటువైపు పెట్టాలి, మరుగుదొడ్లు ఏడ కట్టాలి, తాగునీరు ఎక్కడ ఏర్పాటుచేయాలి, లైట్లు ఫిట్‌‌ చేసేదెక్కడ అనే ప్లాన్ లేకపోతే ఎట్ల? కోటి మందికి పైగా భక్తులు వచ్చే జాతరలో ఇట్లనేనా పనిచేసేది? చిన్న మిస్టేక్ జరిగినా భక్తులంతా ఎంత ఇబ్బంది పడతారు’ అని ఆదివారం మేడారంలో నిర్వహించిన సమీక్షలో పంచాయతీరాజ్​ శాఖ అధికారులపై సీఎస్ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి  ఫైర్‌‌ అయ్యారు.

ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మేడారం మహాజాతర జరగనుంది. కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తోంది. జాతర కోసం వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ చేయడానికి మేడారం చుట్టుప్రక్కల ప్రాంతాలలో 32 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. వెయ్యి ఎకరాలకు పైగా భూములను కేటాయించారు. ఈ స్థలాలను చదును చేసి అక్కడ ఏర్పాట్లు చేసే బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. జాతర మరో 15 రోజుల్లో స్టార్ట్‌‌ అవుతుండగా పార్కింగ్ స్థలాల అభివృద్ధి విషయమై సరైన ప్లానింగ్ లేకుండా పనిచేస్తున్నారంటూ ఉన్నతాధికారులు మండిపడుతున్నారు.

పార్కింగ్ పాయింట్లు ఇవే!

మేడారం జాతర కొచ్చే ప్రైవేట్, ప్రభుత్వ, వీఐపీ, వీవీఐపీ వాహనాలు పార్కింగ్ చేయడానికి మేడారం చుట్టుప్రక్కల ప్రాంతాలలో అధికారులు 32 చోట్ల పార్కింగ్​ స్థలాలను గుర్తించారు. మేడారం వై జంక్షన్, తాడ్వాయి వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపేస్తారు. వీఐపీ, వీవీఐపీ, బాషగూడెం, ఊరట్టం 1బీ, 2ఏ, 2బీ, 2పీ, కన్నెపల్లి 1, 2, జంపన్నవాగు, కొత్తూరు సబ్​స్టేషన్, మరసుర ఆర్ఎఫ్, పోచమ్మ బంధన్, కొత్తూరు 1, 2, కాల్వపల్లి చెక్​పోస్టు, కాల్వపల్లి క్రాస్​రోడ్1, 2, బయ్యక్కపేట, చింతల్ ఆర్టీసీ, చింతల్ క్రాస్​రోడ్​1, 2, అరుమల్ల గుట్ట, యెర్ర చెరువు 1, 2, వెంగళాపూర్, తుర్కని చింతల్, బళ్లని చింతల్, యాసంగి తోగు, మొట్ల గూడెం వద్ద పార్కింగ్ స్థలాలు కేటాయించారు.

లక్షల్లో రానున్న వాహనాలు

ఫిబ్రవరి 5వ తేదీ కంటే ముందునుంచే వాహనాల రాకపోకలు పెరుగుతుంటాయి. మహా జాతర జరిగే ఆ నాలుగు రోజుల పాటు అయితే లక్షల్లో వాహనాలు రావడం ఖాయం. వీటన్నింటిని సరిగా పార్కింగ్​ చేయకపోతే రోడ్డుపైనే ఉంటాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తద్వారా ట్రాఫిక్ జామ్‌‌ అయి మొత్తం జాతరపైనే ప్రభావం పడుతుంది. సరైన పద్ధతిలో వాహనాలను పార్క్‌‌ చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నీ శాఖలకు పార్కింగ్​ స్థలాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచనలు పంపించారు. ఆదివారం సుమారు 30 వేలకు పైగా వాహనాలు వస్తే వాటిని పార్కింగ్​ చేయడానికి స్థలం లేకపోవడంతో పోలీసులంతా చాలా ఇబ్బంది పడ్డారు. కన్నెపల్లి సమీపంలోని పంట పొలాలలో వాహనాలను పార్కింగ్​ చేయించారు.

ప్లానింగ్ ఏదీ?

మేడారం వచ్చే వాహనాలలో కొన్ని 2 నుంచి 5 రోజుల పాటు ఉంటాయి. కొన్ని మాత్రం అదే రోజు వచ్చి వెళ్లిపోతాయి. అయితే వాహనాల పార్కింగ్​ స్థలాల వద్ద డ్రైవర్లు, క్లీనర్లు, కొందరు ఓనర్లు ఉంటారు. అక్కడే నిద్రిస్తారు. వీరికి కనీస వసతులు కల్పించాలి. మరుగుదొడ్లు, మూత్రశాలలతో పాటు తాగునీటి సౌకర్యం ఉండాలి. అలాగే వాహనాలు ఎట్ల లోపలికి వెళ్లాలి?  ఎటునుంచి బయటికి రావాలి? తెలిపేలా ఇన్, అవుట్​ లెట్లు ఏర్పాటు చేయాలి. పార్కింగ్ ఏరియాలో ఎన్ని వెహికల్స్‌‌, ఎట్ల పార్క్ చేయాలనేది సుద్దతో మార్కింగ్​ కూడా వేయాలి. రాత్రి వేళ వెలుతురు ఉండేలా లైట్లు అమర్చాలి. ఇవన్నీ సూచించేలా బోర్డులు పెట్టాలి. కానీ ఎక్కడా పనులు ఇట్ల చేయలేదు. కొన్ని చోట్ల అయితే ఇంకా స్థలాలను చదును కూడా చేయలేదు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి