
- వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
తాడ్వాయి, వెలుగు : మేడారంలో చేపట్టే పనులు శాశ్వతంగా నిలిచేలా ఉండాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ సూచించారు. ‘మహాజాతర – 2026’పై ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎండోమెంట్‌అడ్వైజర్ గోవిందాహరితో కలిసి గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు స్టూడియో వన్ ఆర్కిటెక్టర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై చర్చిస్తున్నట్లు తెలిపారు.
మాస్టర్ ప్లాన్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పక్క ప్రణాళికతో రూపొందించాలని సూచించారు. మహాజాతరకు కోటిన్నర మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని, వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి అలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రతి జాతరకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు చేపడుతున్నామని, ప్రతి పనిని క్వాలిటీతో పూర్తి చేయాలని సూచించారు.
అంతకుముందు జంపన్నవాగు, చిలుకలగుట్ట, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. ఆమె పూజారులు డోలు వాయిద్యాల నడుమ స్వాగతం పలికి గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్, సంపత్‌రావు, ఆర్డీవో వెంకటేశ్, ఏపీవో వసంతరావు, ఈవో వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.