మేడారంలో వేడుకగా మండమెలిగె

మేడారంలో వేడుకగా మండమెలిగె

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగుమేడారంలో బుధవారం మండమెలిగె పండుగ ఘనంగా జరిగింది.  సమ్మక్క, సారలమ్మ దేవాలయాల్లో ఉండే పూజా సామగ్రిని ఆదివాసీ పూజారులు మేడారంలోని గద్దెలపైకి తీసుకొచ్చారు. సమ్మక్క పూజారులంతా ఉదయం సిద్ధబోయిన మునేందర్‌‌ ఇంటి వద్ద కలిశారు. తర్వాత సమ్మక్క గుడికి వెళ్లి శుభ్రంగా కడిగారు. గ్రామ దేవతలకు(బొడ్రాయి) ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ, పోతరాజులకు నీటితో అభిషేకం చేశారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. దుష్టశక్తుల నుంచి గ్రామాన్ని రక్షించాలని కోరుతూ నాలుగు దిక్కులా బూరుగు కర్రలతో తయారుచేసిన ధ్వజ స్తంభాలను నాటారు. వీటికి దిష్టి తోరణాలను కట్టారు.

గద్దెల వద్ద పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. నూతన వస్త్రాలతో గద్దెలను అలంకరించారు. మళ్లీ రాత్రి వేళల్లో సమ్మక్క సారలమ్మ పూజారులు గద్దెపైకి చేరగానే గేట్లను మూసేశారు. రాత్రి 8 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భక్తులను అనుమతించలేదు. అధికారులు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరాను నిలిపివేశారు. వెన్నెల వెలుగుల్లో దేవతలను కొలుస్తూ పూజారులు రాత్రివేళ అక్కడే  జాగారం చేశారు. అమ్మవార్లకు చలపయ్య మొక్కు సమర్పించారు.

గుడుల శుద్ధి

సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వారం రోజుల ముందు మండమెలిగె పండుగ నిర్వహించడం ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్లకో సారి వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజుకు వారం ముందు నాలుగు దేవాలయాలలో ఈ మండమెలిగె పండగ నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇందులో భాగంగా బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు శుద్ధి చేశారు. నీటితో  ఆలయాలను శుభ్రంగా కడిగి, పుట్టమట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు. తల్లులు ధరించిన ఆయుధాలు, పూజా సామగ్రిని శుభ్రం చేశారు. దేవతామూర్తులు ధరించిన  మువ్వలు, గజ్జెలు, ఆడేరాలు, కత్తులు, కుంకుమ భరిణేలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించారు. మేడారంలో సిద్దబోయిన జగ్గారావు, మునేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వడ్డెర కొక్కర కృష్ణయ్య ఆధ్వర్యంలో, కన్నెపల్లిలో కాక సారయ్య, కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆధ్వర్యంలో, కొత్తగూడ మండలం పూనుగుండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు దేవాలయంలో పెనుక వంశస్తులు మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సమ్మయ్య,   బుచ్చిరాములు, సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ఆధ్వర్యంలో, కన్నాయిగూడెం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజు ఆలయంలో దబ్బగట్ల
వంశస్తుల ఆధ్వర్యంలో ఆదివాసీ పూజారులు ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.