
- సమ్మక్క సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- వన దేవతల పూజా సామగ్రి శుద్ధి
జయశంకర్ భూపాలపల్లి, తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తొలి ఘట్టం విజయవంతమయ్యింది. గిరిజనుల్లో భక్తి భావం వెల్లివిరిసింది. నాలుగు గ్రామాలు జాతర శోభను సంతరించుకున్నాయి. బుధవారం గుడి శుద్ధి పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను పాటించారు. మేడారం, కన్నెపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాలను శుభ్రం చేసి పూజా సామగ్రిని శుద్ధి చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల మధ్య ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. మేడారం మహా జాతర ప్రారంభానికి రెండు వారాల ముందు గుడి శుద్ధి పండుగను పూజారులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే మేడారం గ్రామస్థులు ఉదయాన్నే లేచి సమ్మక్క గుడి లోపల, బయట నీటితో శుద్ధి చేశారు. అనంతరం పూజారులు సమ్మక్క దేవతకు సంబంధించి రహస్య పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన మునిందర్ ఇంట్లో సమ్మక్క దేవతకు చెందిన వస్తువులకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేశారు. అనంతరం పలువురు ముత్తైదువలు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, హారతులతో గుడికి బయలుదేరారు. వీరి ముందు సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణ, జలకం పూజారి మల్లెల ముత్తయ్య, ధూపం పట్టే పూజారి కొక్కెర నాగేశ్వర్‌రావు ముందు నడవగా డోలు వాయిద్యాలతో పూజారులు గుంపుగా గుడికి బయలుదేరి వెళ్లారు.
గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్లారు. తర్వాత ముత్తైదువలు గుడి లోపల పుట్టమన్నుతో గద్దెను అలికి, ముగ్గులు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డిని పూజారులు గుడి పైభాగంలో పాత సంప్రదాయం ప్రకారం కప్పారు. సమ్మక్క గుడి లోపల, బయట ముగ్గులు వేసిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మేకను బలిచ్చి మొక్కులు సమర్పించారు. ఇదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయంలో కూడా చేశారు. అక్కడ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, వెంకన్న తదితరుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కొత్తగూడ మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయం, కన్నాయిగూడెం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజుల దేవాలయంలో కూడా ఇదే విధంగా గుడి శుద్ధి పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు మునేందర్, వసంతరావు, జనార్ధన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.