- తల్లుల చెంతకు తరలివచ్చిన మహిళలు
- సాఫీగా భక్తుల దర్శనాలు
- అలరించిన కళాకారుల పాటలు
ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ప్రాంగణం పులకించింది. ఆదివారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాగా, జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు సుమారు 15 వేల మంది హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యూ లైన్ల షెడ్లలో మహిళలతో నిండిపోయారు. వేదికపై కళాకారుల ఆటాపాట అలరించాయి.
మేడారంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతమంతా పోలీసుల కంట్రోల్ లోకి వెళ్లింది. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 1600ల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు
చేపట్టారు.
అలరించిన ఆటపాట..
మేడారంలో జరిగిన సీఎం బహిరంగ సభలో సాంస్కృతిక కళాకారుల ఆట పాట అలరించాయి. ఆదివాసీ, గోండు, కోయ నృత్యాలు అబ్బురపరిచాయి. ఒండ్రు సుధారాణి రేలా కళాకారుల బృందం, లక్ష్మీ దేవర నృత్యం, జల్లి అర్జున్ బృందం కొమ్ముకోయ, ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. కేబినెట్ మీటింగ్ పూర్తయ్యి సభ జరిగే వరకు సుమారు ప్రజలు, మహిళలు, నాయకులు ఓపికగా వేచి ఉన్నారు. మొత్తంగా సీఎం టూర్ మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ప్రశాంతంగా భక్తుల దర్శనం
మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత దర్శనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు సీఎం పర్యటన నేపథ్యంలో వన్ వే చేపట్టారు. ములుగు నుంచి వచ్చే వాహనాలను పస్రా మీదుగా మేడారం, దర్శనం అనంతరం తిరిగి బయ్యక్కపేట, భూపాలపల్లి మీదుగా గమ్యస్థానాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం భారీగా భక్తులు తరలివచ్చారు. సభ కోసం వచ్చిన వారు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు.
19న గద్దెల ప్రారంభోత్సవం..
రెండు రోజుల పర్యటనకు వచ్చిన సీఎం మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ కాగా, సోమవారం అమ్మవార్ల గద్దెల పునఃప్రారంభించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రకారంలోని ఆర్చ్ లు, ఇతర కట్టడాలకు పూలు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలు అద్భుతంగా ముస్తాబయ్యాయి.
భద్రతపై డీజీపీ సమీక్ష..
మేడారం మహాజాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. జాతరకు సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ, ఊరేగింపు మార్గాలతోపాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. రియల్ టైమ్ మ్యాప్స్, సీసీ టీవీ, డ్రోన్ టెక్నాలజీ ద్వరా పరిస్థితులను పర్యవేక్షించారు.
విద్యుత్ వెలుగుల్లో మేడారం..
మాస్టర్ ప్లాన్ పనులు పూర్తయిన నేపథ్యంలో మేడారంలో విద్యుత్ వెలుగులతో నిండి పోయింది. గద్దెల ప్రాంగణంతో పాటు చిలుకల గుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, మ్యూజియం తదితర ప్రాంతాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ నిత్యం పర్యవేక్షిస్తూ శోభాయమానంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నారు. కూడళ్లలో ఏర్పాటు చేసిన కళాకృతుల వద్ద భక్తులు సెల్ఫీలు దిగుతున్నారు.
డ్రోన్లతో నిఘా..
ఏటూరునాగారం, వెలుగు: మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఆదివారం జరిగింది. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మేడారంలో కాలినడకన జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ములుగు ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రోన్లతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మేడారం సభలో డ్రోన్ సహాయంతో డిజిటల్ తెరపై మేడారం నయా ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో తెరపై మేడారం జాతరతోపాటు జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని తీసిన వీడియోను చూపించారు.
