
Google’s AI Overview: ఇందుగలను అందులేను అన్నట్లుగా ఏఐ తన విస్తరణను కొనసాగిస్తూనే ఉంది. గడచిన కొన్ని రోజులుగా ఐటీ ఉద్యోగులను భయానికి గురిచేస్తున్న ఏఐ సాంకేతికత ప్రస్తుతం మీడియా రంగాన్ని కూడా కుదిపేస్తోంది. ఇప్పటికే దేశంలోని న్యూస్ కంపెనీలు ఏఐ ప్రభావంతో తగ్గుతున్న ఆన్ లైన్ యూజర్ల సమస్యను ఎదుర్కొంటున్నాయి.
వాస్తవానికి గూగుల్ లో ఏదైనా అంశం కోసం సెర్చ్ చేసినప్పుడు గతంలో వివిధ పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన న్యూస్ లింక్స్ వచ్చేవి. కానీ ప్రస్తుతం ఏఐ రాకతో గూగుల్ అందిస్తున్న ఏఐ సమ్మరీస్ కారణంగా న్యూస్ వెబ్ ట్రాఫిక్ భారీగా తగ్గుతోందని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా అంశం గురించి అడగగానే ప్రస్తుతం గూగుల్ ఏఐతో కొన్ని పేరాలుగా సమాచారాన్ని చూపిస్తోంది. అయితే ఆ సమాచారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నదనే లింక్స్ చివరన ఇవ్వటంతో రీడర్స్ తగ్గుతున్నట్లు మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే ధోరణి కొనసాగితే కొన్నాళ్లకు తమ యూజర్ ట్రాఫిక్, ఎంగేజ్మెంట్ భారీగా దెబ్బతినొచ్చని మీడియా దిగ్గజాలు కూడా అంటున్నాయి. ఇదే క్రమంలో గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ నుంచి సమాచారాన్ని ఎక్కువగా ఏఐ ఓవర్ వ్యూ చూపుతోందని గుర్తించబడింది. దీనిపై నిర్వహించిన ఒక అధ్యయన ఫలితాలతో యూకేలో దర్యాప్తు చేయాలని పిటిషన్ ఫైల్ చేయబడింది.
అయితే ఈ ఆరోపణలు సరైనవి కాదని గూగుల్ ఖండిస్తోంది. ఇవి పూర్తిగా వారి ఊహాజనితమైన ఆరోపణలేనని, వారు పంచుకున్న సమాచారం పూర్తిగా లేదని చెబుతోంది. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఏఐ ఆధారిత సేవలవైపు మెుగ్గుచూపుతున్న తీరు కారణంగా మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ తాము బిలియన్ల కొద్ది క్లిక్స్ వెబ్ సైట్లకు చూస్తున్నామని.. ట్రాఫిక్ డ్రాప్ గమనించలేదని వెల్లడించింది గూగుల్. అయితే ప్రతి 100 మందిలో ఒక్కరు మాత్రమే ఏఐ సమ్మరీ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేస్తున్నట్లు యూఎస్ రీసెర్చ్ సంస్థ Pew Research Center గుర్తించింది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన డేటా పంచుకోవటానికి నిరాకరించటం ఏఐ ప్రభావం నిజమేననే ఆందోళనలను పెంచుతోంది.
యూకేలోని మీడియా సంస్థలు దాదాపు 50 శాతం వరకు ట్రాఫిక్ తగ్గింపును మార్చి నెలలో చూసినట్లు చెప్పాయి. ఏఐ సమ్మరీ ప్రవేశపెట్టిన తర్వాత దాని తీవ్ర పరిణామాలు చూస్తున్నాయి. గూగుల్ జర్నలిస్టుల పనిని దొంగిలిస్తూ స్వలాభం పొందుతోందని ఫాక్స్ గ్లోవ్ డైరెక్టర్ రోసా కర్లింగ్ చెప్పారు. ఇది న్యూస్ సంస్థలు తమ టార్గెట్ ఆడియన్స్ ని చేరుకోవటానికి కష్టతరం అయ్యేలా చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.