మీడియా విశ్వసనీయతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం :  మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

మీడియా విశ్వసనీయతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం :  మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

అబిడ్స్, వెలుగు: మీడియా క్రమంగా తన విశ్వసనీయతను కోల్పోవడం మంచిది కాదని, మీడియా విశ్వసనీయతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించిన దేవులపల్లి అమర్ ‘పరిణతవాణి’ కార్యక్రమానికి ఆయన గెస్ట్​గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం అభ్యుదయం, విప్లవం, వామపక్ష భావాల పట్ల వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ, ప్రతికల్లో పనిచేసే వారిలో ఎక్కువగా సామాజిక చింతన, అభ్యుదయ భావాలు కలిగిన వారు ఉండేవారని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఎంతో కృషి చేసిందని, ఆ పోరాటంలో దేవులపల్లి అమర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, సమన్వయకర్త రామ్మూర్తి, దేవులపల్లి అమర్, ప్రముఖ భాషావేత్త డి.చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.