
కేంద్రమంత్రి బీజేపీ ఎంపీ, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi) తాజాగా మంగళవారం (ఆగస్ట్ 27న)మీడియాపై మండిపడ్డారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రమంత్రి సురేశ్ గోపీ స్పందించారు. సినీ పరిశ్రమపై ప్రజల అభిప్రాయాన్ని మీడియా తప్పుదోవ పట్టిస్తున్నారని సురేష్ గోపి అన్నారు.
‘‘మలయాళ చిత్ర పరిశ్రమలో వస్తున్న లైంగిక ఆరోపణలు గురించి మీడియా చేస్తున్న ప్రచారం ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఈ ఆరోపణలే మీడియాకు ఆహారం పెడుతున్నాయి. మీరు డబ్బు సంపాదించేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారని అర్థమవుతోంది. అయితే..వాస్తవాలు ఏంటో తెలియకుండా సినీ పరిశ్రమపై ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు’’ అని సురేశ్ గోపీ మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం ఈ విషయంలోని ప్రతి సమస్యలు కోర్టులో ఉన్నాయి. కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు మీ తెలివితేటలు ఆపండి అన్నారు.
మీరు కోర్టు కంటే గొప్ప..?
‘‘మీ స్వలాభాల కోసం అలజడి సృష్టించేందుకు ప్రయత్నించడమే కాకుండా.. వారి అభిప్రాయాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు న్యాయస్థానం కంటే గొప్పకాదు. ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది. అతి త్వరలో నిజానిజాలు తెలుస్తాయి. అంతవరకు వేచి ఉండండి. న్యాయస్థానాన్ని ఓ నిర్ణయం తీసుకోనివ్వండి’’ అని సురేశ్ గోపి వెల్లడించారు.
జస్టిస్ హేమ కమిటీ:
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ (Hema Committee) ఇటీవల విడుదల చేసిన నివేదిక..రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమా..ఆ కమీషన్‌కు నాయకత్వం వహించారు. నటి శారదతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమీషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆ కమీషన్ ఇటీవలే తన నివేదికను సీఎం విజయన్‌కు సమర్పించింది.
ఈ నివేదిక అనంతరం.."మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను" పరిశీలించేందుకు ప్రత్యేక సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమై ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సిఎంఓ తెలిపింది.
అలాగే ఈ నివేదిక విడుదలైన నేపథ్యంలోపలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.