550 జీవో ప్రకారం మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి: ఆర్ కృష్ణయ్య డిమాండ్

550 జీవో ప్రకారం మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి: ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: మెడికల్  కౌన్సిలింగ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 114ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్  కృష్ణయ్య డిమాండ్  చేశారు. నాలుగేండ్లుగా ఎంబీబీఎస్  సీట్ల కేటాయింపులో అమలు చేస్తున్న రిజర్వేషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. 300 మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని, 550 జీవోను అమలు చేయాలని డిమాండ్  చేశారు.

 ఆదివారం విద్యానగర్  బీసీ భవన్ లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్  నీల వెంకటేశ్  అధ్యక్షతన మెడికల్  కౌన్సెలింగ్  అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న 550 జీవోను పక్కన పెట్టి 2021లో 114 జీవోను తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దీనిని సరిదిద్దాలని అధికారులు, మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవండం లేదన్నారు. 

సుప్రీంకోర్టు జీవో నంబర్  550 ప్రకారం అడ్మిషన్లు చేపట్టాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాజేందర్, మోడీ రాందేవ్, అనంతయ్య, తాళ్లపల్లి రామకృష్ణ గౌడ్, నిఖిల్  పటేల్, రఘుపతి గౌడ్, సంధ్య, తిరుపతమ్మ, బాలయ్య పాల్గొన్నారు.