సర్కార్​ దవాఖానాల్లో .. అన్ని టెస్టులు ఫ్రీ

సర్కార్​ దవాఖానాల్లో .. అన్ని టెస్టులు ఫ్రీ

కరీంనగర్ టౌన్, వెలుగు:  సర్కార్​ దవాఖానాల్లో అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తున్నామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్​లో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. డాక్టర్లను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చామని, వాటితో వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నామన్నారు.

 తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలు గమనించాలని కోరారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, శిక్షణ జాయింట్​కలెక్టర్ నవీన్ నికోలస్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్​ రుద్రరాజు, డీఎంహెచ్‌వో  లలితాదేవి, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్ పాల్గొన్నారు. అంతకుముందు  స్థానిక ఉజ్వల పార్కు ఎదురుగా సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమికి 5 గుంటల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య దినోత్సవాలు నిర్వహించారు. 

కోరుట్ల, వెలుగు: కోరుట్లలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, అడిషనల్​ కలెక్టర్​ లత పాల్గొన్నారు. అనంతరం కోరుట్లలో గర్భిణులకు న్యూట్రీషన్​ కిట్లు అందజేశారు. వైద్య రంగంలో సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందించారు.  

గంగాధర, వెలుగు:  ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ-, సర్పంచ్​ రమ్య, ఏఎంసీ మాజీ చైర్మన్​ మహిపాల్​రావు, ఎంపీటీసీ లక్ష్మి-​, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.

డాక్టర్ల సేవలను వెలకట్టలేం

జమ్మికుంట, వెలుగు: డాక్టర్ల సేవలకు వెలకట్టలేమని, మనుషుల ప్రాణాలను నిలబెట్టే వైద్య వృత్తి ఎంతో విలువైనదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం జమ్మికుంటలో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది బతుకమ్మ బోనాలతో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు రాధిక, రాజేశ్వరరావు పాల్గొన్నారు.