
- గాంధీ మెడికల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో హరీష్ రావు
- ఆపదలో ఉన్నోళ్లకు డాక్టర్లే దేవుళ్లు
- వైద్యం ఉద్యోగం కాదు.. గౌరవప్రదమైన వృత్తి అన్న మంత్రి
పద్మారావునగర్, వెలుగు: వైద్యం ఉద్యోగం కాదని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే గొప్ప గౌరవప్రదమైన వృత్తి అని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడే రోగికి ఆ క్షణం డాక్టర్లే దేవుళ్లని ఆయన పేర్కొన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ 2017 బ్యాచ్ కు చెందిన 200 మంది మెడికల్ స్టూడెంట్ల గ్రాడ్యుయేషన్ వేడుక ఆదివారం రాత్రి గాంధీ కాలేజీ ఆవరణలోని గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పీహెచ్సీ, బస్తీ, పల్లె దవాఖాన్లలో పనిచేయాలని, ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వైద్యవిద్యను అందిస్తున్నదన్నారు. సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నా డాక్టర్లు, సైనికులు, రైతులకు మాత్రమే అరుదైన గౌరవం ఉంటుందన్నారు. తల్లి జన్మనిస్తే, ఆపదలో పునర్జన్మను ఇచ్చేది డాక్టర్లే అని కొనియాడారు. ఎంబీబీఎస్ సీట్ల ర్యాంకింగ్ లో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని, పీజీ సీట్లలో సెకండ్ ప్లేస్‌లో ఉందన్నారు.
‘‘గతంలో రాష్ర్టంలో మొత్తం పీజీ మెడికల్ సీట్లు 1,183 ఉంటే ఆ సంఖ్యను తెలంగాణ వచ్చాక 2,890 కు పెంచినం. త్వరలో మరిన్ని సీట్లను పెంచి, దేశంలోనే పీజీ సీట్లలో కూడా ఫస్ట్ ప్లేస్ తెస్తం. నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ ఎక్విప్ మెంట్ ఇచ్చినం. దీంతో బెస్ట్ డాక్టర్స్ తయారవుతున్నారు. త్వరలో వరంగల్ తో పాటు హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తం. అందులో సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రవేశపెడతం. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో రాష్ట్ర సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది” అని హరీశ్ పేర్కొన్నారు.
మెరిట్ సాధించిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు మంత్రి గోల్డ్ మెడల్స్, పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, డాక్టర్లు పాల్గొన్నారు.