
హైదరాబాద్ : తమ కాలేజీల పర్మిషన్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసి 3 నెలలు అవుతోందని, ఇప్పటికైనా తమను ఇతర కాలేజీల్లోకి సర్దుబాటు చేయాలని మహావీర్, ఎంఎన్ఆర్, టీఆర్ఆర్ మెడికల్ కాలేజీల స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఒత్తిడికి గురవుతున్నామని, తమలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకునే వరకు ప్రభుత్వం పట్టించుకునేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కోఠిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద గురువారం ఆందోళనకు దిగారు. తర్వాత డీఎంఈ రమేశ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఎన్ఎంసీ, హైకోర్టు చెప్పినా హెల్త్ యూనివర్సిటీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఇది తన పరిధిలోని అంశం కాదని, అయినప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని డీఎంఈ రమేశ్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా మెడికోలు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిశామని, ఆయన సూచనతో ఎన్ఎంసీ చైర్మన్‌ను కలిశామని స్టూడెంట్స్ వెల్లడించారు. రీఅలకేషన్పై ఎన్ఎంసీ నుంచి రాష్ట్ర హెల్త్ సెక్రటరీకి, హెల్త్ వర్సిటీ వీసీకీ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ ఎన్ఎంసీ అధికారులు తమకు చూపించారన్నారు. గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ రీఅలకేట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.