ప్రభుత్వాస్పత్రులకు మెడిసిన్స్ సప్లై చేయలేం: ఫార్మా కంపెనీలు

ప్రభుత్వాస్పత్రులకు మెడిసిన్స్ సప్లై చేయలేం: ఫార్మా కంపెనీలు

సర్కారు దవాఖాన్లకు మందులు సరఫరా చేసేందుకు రాష్ర్టంలోని ఫార్మా కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, తక్కువ ధరకు మెడిసిన్ ఇవ్వాలని కోరడంతో చాలా కంపెనీలు కనీసం టెండర్లు కూడా వేయడం లేదు. ఈసారి గవర్నమెంట్ హాస్పిటళ్లకు పంపిణీ చేసేందుకు సుమారు 600 రకాల మెడిసిన్ కొనుగోలు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏయే మెడిసిన్ ఏయే ధరలో కొనాలన్నది కూడా అధికారులే నిర్ణయిస్తారు. ఆ ధరలో సప్లై చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ‘రేట్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌’ ఇస్తారు. అవసరమైన ప్రతిసారీ రేట్ కాంట్రాక్ట్ సంస్థలు మెడిసిన్ సప్లై చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈ సంస్థల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈసారి ఇతర రాష్ర్టాల్లో కంటే తక్కువ ధరకు మందులు కొనాలని నిర్ణయించడంతో, రేట్ కాంట్రాక్ట్ తీసుకునేందుకు ఫార్మా సంస్థలు ఆసక్తి చూపడం లేదు. 600 రకాల మెడిసిన్‌‌‌‌‌‌‌‌లో సుమారు 200 రకాల మెడిసిన్ రేట్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి సంస్థలు ముందుకు రాలేదని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖాన్లలో మందుల కొరత విపరీతంగా ఉండడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌తో చైనా నుంచి ముడి సరుకు దిగుమతి ఆగిపోయింది. దీంతో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడి, మందుల కొరత ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెడిసిన్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు ఆలస్యమైతే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదముందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫార్మా సంస్థలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. సుమారు 50 సంస్థల ప్రతినిధులతో ఈ నెల 2న సమావేశం జరగనుంది.

అరకొర కేటాయింపులు.. విడుదలలోనూ జాప్యం

రెండేండ్లుగా మందుల కొనుగోలుకు ప్రభుత్వం అరకొరగానే నిధులు కేటాయిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.332 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది కేవలం రూ.226 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించిన దాంట్లో 70 శాతం నిధులను కూడా విడుదల చేయలేదు. దీంతో మందుల కొనుగోలుదారులకు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ భారీగా బకాయిలు పడింది. టీచింగ్ హాస్పిటళ్ల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ అవసరమైన మెడిసిన్‌‌‌‌‌‌‌‌ను ఈ సంస్థ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడంతో, మెడిసిన్ సప్లై చేసిన, ఆరేడు నెలలకు కూడా ఫార్మా సంస్థలకు డబ్బులు విడుదల చేయడం లేదు. ఇతర రాష్ట్రాల కంటే కాస్త ధరలు ఎక్కువగా చెల్లిస్తుండడంతో, ఇప్పటివరకూ మెడిసిన్ సప్లై చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ధరలు ఎక్కువగా ఉండడంపై ఇటీవల మంత్రి ఈటల సమీక్షించారు. ఇతర రాష్ర్టాల్లో కంటే తక్కువకే మెడిసిన్ కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ర్టం నుంచి ఫార్మా ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతున్నయి. ప్రభుత్వం సైతం ఆయా కంపెనీలకు రాయితీలు ఇస్తోంది. ఇవన్నీ వివరించి తక్కువ ధరలకు మెడిసిన్ సప్లై చేసేందుకు ఒప్పించాలని సర్కారు భావిస్తోంది.