IND vs OMA: పాపం పాండ్యకు బ్యాడ్ లక్.. శాంసన్ షాట్‌కు హార్దిక్ ఔట్

IND vs OMA: పాపం పాండ్యకు బ్యాడ్ లక్.. శాంసన్ షాట్‌కు హార్దిక్ ఔట్

ఆసియా కప్ లో శుక్రవారం (సెప్టెంబర్ 19) ఒమన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు దురదృష్టం వెంటాడింది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న ఇండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి నాలుగో స్థానంలో వచ్చిన పాండ్య రనౌట్ రూపం లో వెనుదిరగడం విచారకరం. ఇన్నింగ్స్ 8 ఓవర్లో ఊహించని రీతిలో రనౌటయ్యాడు. 

ఇన్నింగ్స్ 8 ఓవర్ మూడో బంతికి ఒమన్ పేసర్ జితెన్ రామనందిని వేసిన బంతిని శాంసన్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. బౌండరీ ఆపే క్రమంలో నేరుగా వస్తున్న బంతి జితెన్ చేతికి తగిలి వికెట్లను తాకింది. బాల్ స్టంప్స్ కు తగిలే సమయంలో హార్దిక్ నాన్ స్ట్రైకింగ్ లో క్రీజ్ లో బ్యాట్ పెట్టలేదు. దీంతో కేవలం ఒక పరుగుకే పాండ్య ఔటయ్యాడు. ఇప్పటివరకు టోర్నీలో బ్యాటింగ్ కు దిగని హార్దిక్ పాండ్యను కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపించాడు. అయితే వచ్చిన అవకాశం దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో చేజారింది.

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇండియా మొదటి 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజ్ లో శాంసన్ (48), తిలక్ వర్మ ఉన్నారు. అభిషేక్ శర్మ ధనాధన్ బౌండరీలతో అలరించగా.. అక్షర్ పటేల్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గిల్ (5), పాండ్య (1) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.