Bhadrakaali Review: విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' మూవీ రివ్యూ.. పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచిందా?

Bhadrakaali Review: విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' మూవీ రివ్యూ.. పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచిందా?

విలక్షణమైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తన 25వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో 'శక్తి తిరుమగన్'గా విడుదలై, తెలుగులో 'భద్రకాళి' పేరుతో ఈ రోజు ( సెప్టెంబర్ 19న )  విడుదలైంది. ఈ సినిమా  ఒక రాజకీయ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 'అరువి' లాంటి క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా?

ఈ చిత్రంలో తృప్తి రవీంద్ర, సునీల్ క్రిప్లాని, వాగై చంద్రశేఖర్, మాస్టర్ కేశవ్, సెల్ మురుగన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో ప్రముఖ నటుడు సునీల్ క్రిప్లాని తిరిగి వెండితెరపైకి రావడం విశేషం. ఆయన భారతీరాజా క్లాసిక్ చిత్రం "కాదల్ ఓవియం' (1982) లో కథానాయకుడిగా కన్నన్ అనే పేరుతో నటించారు.. 

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందించారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ చూసుకోగా, మీరా విజయ్ ఆంటోనీ సమర్పకురాలిగా వ్యవహరించారు. 'వాజ్‌ల్' (2021) సినిమాకు పనిచేసిన కెమెరామెన్ షెల్లీ కాలిస్ట్, ఎడిటర్ రేమండ్ డెర్రిక్ క్రాస్టా ఈ సినిమాకు సాంకేతిక బృందంలో పనిచేశారు.

కథాంశం:

కథానాయకుడు కిట్టు (విజయ్ ఆంటోనీ) ఒక పవర్ బ్రోకర్. ప్రభుత్వ వ్యవస్థలో తనకున్న పరిచయాలు, తెలివితేటలతో అతను ఎన్ని క్లిష్టమైన పనులైనా సునాయాసంగా చక్కబెడుతుంటాడు. కేంద్ర మంత్రి లతకు సంబంధించిన రూ. 800 కోట్ల భూముల వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహిస్తూ, ఆ పనిని దాదాపు పూర్తి చేస్తాడు. అయితే, ఊహించని విధంగా ఒక ఎమ్మెల్యే హత్యకు గురవడం, ఆ తర్వాత కిట్టునే లక్ష్యంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగడంతో కథ ఉత్కంఠగా మారుతుంది. కిట్టు  రూ. 6,200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటాడు. అసలు సచివాలయం ముందు కాఫీలు అమ్మే కిట్టు ఇంత శక్తివంతమైన పవర్ బ్రోకర్‌గా ఎలా మారాడు? అతనికి, రాష్ట్రపతి కావాలనుకుంటున్న అభయంకర్‌కు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే 'భద్రకాళి' మూవీ.

పబ్లిక్ రియాక్షన్స్.. 

సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి  మిశ్రమ స్పందన వచ్చింది. ఒక ప్రేక్షకుడు ఈ చిత్రాన్ని 'పొలిటికల్ థ్రిల్లర్'గా అభివర్ణించారు. విజయ్ ఆంటోనీ నటన అద్భుతంగా ఉంది. దర్శకుడు అరుణ్ ప్రభు అసాధారణమైన పరిశోధన, స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. అంచనాలకు అందని విధంగా సాగిన స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద ప్లస్. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఇది చూడదగిన పొలిటికల్ కమర్షియల్ థ్రిల్లర్ అని ఆయన పేర్కొన్నారు.

 

మరొక ప్రేక్షకుడు, సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. విజయ్ ఆంటోనీ నటన చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కుంభకోణం సీన్స్, ఇంటర్వెల్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అని ప్రశంసించారు. షెల్లీ కాలిస్ట్ సినిమాటోగ్రఫీ, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

 

సినిమా ఫస్ట్ హాఫ్ చాచాలా వేగంగా సాగుతుంది. హీరో పాత్ర పరిచయం, ఆ తర్వాత అతను కేంద్ర మంత్రి భూముల వ్యవహారంలో వేలు పెట్టడం, వచ్చే మైండ్‌గేమ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ముగింపులో వచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. రెండవ భాగం హీరో ఫ్లాష్‌బ్యాక్, అతని గతం గురించి వివరిస్తుంది. ఈ భాగంలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా హీరో-విలన్ మధ్య జరిగే పోరాటం, క్లైమాక్స్ సన్నివేశాలు కొంత నిడివి ఎక్కువ అనిపించేలా ఉందని అభిప్రాయపడుతున్నారు.

 

ఎవరెవరు ఎలా చేశారంటే 

విజయ్ ఆంటోనీ కిట్టు పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. తన నటనతో పాత్రకు బలాన్నిచ్చారు. సినిమా మొత్తంలో ఆయన ఒకే ఎమోషన్‌లో కనిపించినప్పటికీ, ఆ పాత్రకు అదే సరిపోయింది. ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే అందించడం విశేషం. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాలోని ఉత్కంఠను పెంచింది. తృప్తి రవీంద్ర పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. విలన్ పాత్రలో నటించిన సునీల్ కృపాలనీ తన నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించారు.

'భద్రకాళి' ఒక పొలిటికల్ థ్రిల్లర్. థ్రిల్లింగ్ కథలను ఇష్టపడేవారికి, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్నవారికి ఈ సినిమా మంచి ఎంపిక. కథనం సంక్లిష్టంగా ఉండటం, ద్వితీయార్థం కొంత నెమ్మదిగా సాగడం వంటి లోపాలు ఉన్నప్పటికీ, విజయ్ ఆంటోనీ నటన, నేపథ్య సంగీతం, ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా ఉండటం సినిమాకు బలాలుగా చెప్పొచ్చు. మొత్తం మీద, ఈ సినిమా ఒకసారి చూడదగిన చిత్రంగా నిలుస్తుంది.