
అతను ఓ బ్యాంకు మేనేజర్.. మంచి జీతం, పెళ్లయ్యింది.. లైఫ్ హ్యాపీగా సాగుతోంది. ఏమైందో ఏమో.. డ్యూటీకి వెళ్ళొస్తానని చెప్పి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చావు తనను పిలుస్తోందని ఆడియో రికార్డు చేసి మరీ.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు సదరు బ్యాంకు మేనేజర్. యాదాద్రి భువనగిరి జిల్లా రామంతాపూర్ లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
రామంతాపూర్ ప్రాంతానికి చెందిన బర్ల సురేంద్ర ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు. డ్యూటీకి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సురేంద్ర బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
భర్త చెరువులో దూకిన విషయం జీర్ణించుకోలేని సురేంద్ర భార్య సంధ్యారాణి.. అదే చెరువులో దూకేందుకు ప్రయత్నించగా.. స్థానికులు, పోలీసులు కాపాడారు. సురేంద్ర గత పదిరోజులుగా మనస్తాపంతో బాధపడుతున్నారని చెబుతున్నారు బంధువులు. పదిరోజుల నుంచి చావు తనను పిలుస్తోందని.. ఆర్థిక ఇబ్బందులు లేవని ఆడియో రికార్డ్ చేసి.. ఫోన్ చెరువు కట్టపైనే పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సురేంద్ర.
సురేంద్ర మరణం జీర్ణించుకోలేని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సంధ్యారాణి రోదన అందరిని కలిచివేసింది. సురేంద్ర మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. సురేంద్ర ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.