ప్రభుత్వ పనితనానికి, ప్రతిపక్షాల చిత్తశుద్ధికి పరీక్ష

ప్రభుత్వ పనితనానికి, ప్రతిపక్షాల చిత్తశుద్ధికి పరీక్ష

కొంత కాలం క్రితం మేడిగడ్డ పంప్​ హౌస్​ సేఫ్టీ వాల్ వరదలను తట్టుకోలేక కూలిపోయింది. 12 బాహుబలి మోటర్లు పాడైనయి. అందులో 6 మోటర్లు పనికిరాకుండా ధ్వంసమైనాయని తెలుస్తోంది. మొత్తం 17 మోటర్లకుగాను, 5 మోటర్లు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయంటున్నారు. ఇపుడు మేడిగడ్డ బ్యారేజీ 3 పిల్లర్లు కుంగిపోయాయంటున్నారు.  చడీచప్పుడు లేదు. సీఎంగానీ, బాధ్యత గల ‘ముఖ్యమైన’ మంత్రిగానీ స్పందించిందిలేదు. అయినదానికి, కానిదానికి స్పందించే ‘ముఖ్యమైన’ మంత్రి పిల్లర్లు కుంగిపోవడంపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు అసాంఘిక శక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అది నిర్మాణ లోపమా? అసాంఘిక శక్తుల పనా? లేదా అసాంఘిక శక్తులపై అనుమానం రేపుతూ, నిర్మాణ లోపాన్ని మరిపించడమా? జరిగిన సంఘటనపై నిజానిజాలు మాత్రం తేలాల్సిందే. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ప్రెస్​ మీట్​ పెట్టి ‌‌‌‌- ‘కేంద్ర డ్యామ్​ సేఫ్టీ అథారిటీకి లేఖ రాస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు కేంద్రానికి లేఖ రాయాల’ని సలహా ఇచ్చారు. ఇక కాంగ్రెస్​ నాయకులు కూడా షరామామూలుగా స్పందించారు.  ఇది లక్షన్నర కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు.  ప్రాజెక్టు డిజైన్​పై, నిర్మాణంపై, అవినీతిపై, రాజకీయ వర్గాలు, ఇంజనీర్​ నిపుణులు అనేకులు  ఎంతో కాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అనుమానాలు ఇప్పటికైనా నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం కేంద్రానిదే!

కేంద్ర బృందం దర్యాప్తు ఫలితమిచ్చేనా?

కేంద్ర డ్యామ్​ సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి కుంగిన పిల్లర్ల​నే పరిశీలించనుందా? లేదా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలన్నిటిపై దర్యాప్తు చేయనుందా? కిషన్​రెడ్డి ఎలాంటి దర్యాప్తు జరుగుతుందో చెప్పలేదు. ప్రాజెక్టు ఇంజనీర్లు ఇచ్చే వివరాలనే తీసుకెళ్లడానికి వచ్చేటట్లయితే, కుంగిన పిల్లర్​ పునర్నిర్మాణంపై సలహా ఇవ్వడానికి మాత్రమే వస్తే.. ఆ బృందం దర్యాప్తు  నుంచి మొత్తం ప్రాజెక్టు నిర్మాణ లోపాల వివరాలను ఆశించడం అత్యాశేనేమో! అంటే అదో ‘మమ’ దర్యాప్తే కానుందా? తెలంగాణ రాజకీయాలను చూస్తుంటే ఎవరికైనా కలిగే అనుమానమే అది! 

ఫలితమెంత? ప్రచారమెంత?

నాలుగేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన ఫలితమేమిటో ఎవరికీ అంతుపట్టదు. మూడేండ్లలో  మూడు బ్యారేజీల్లోకి ఎత్తిపోయడం, పైనుంచి వరదలు రాగానే కిందికి వదిలేయడమే ఆ ప్రాజెక్టు పనిగా మారిపోయింది. ఇంత ఖరీదైన ప్రాజెక్టు నుంచి మూడేండ్లలోనూ ఫలితమే కనిపించకపోవడానికి మించిన అనర్థం తెలంగాణకు ఇంకేముంటుంది? ఇలాంటి ప్రాజెక్టు డిజైన్​పైనా, నిర్మాణంపైనా సమగ్ర దర్యాప్తు జరిపితే గానీ పరిష్కారం దొరకదు. 

ఆ ప్రాజెక్టు ఆర్హతపైనే అనేక మంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా మొండిగా ముఖ్యమంత్రే తానే  ఇంజినీరు అన్నట్లుగా ఆ ప్రాజెక్టును సమర్థించుకుంటూ నిర్మాణం చేశారు. ఇది ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అంటూ.. డిస్కవరీ చానెల్​ వాళ్లతో డాక్యుమెంటరీ చేయించారు. చివరకు పంప్​హౌస్​ వాల్​ కొట్టుకు పోగానే, డిస్కవరీ చానెల్​ వాళ్లు కాళేశ్వరం డాక్యుమెంటరీని  డిలీట్​ చేసుకున్నారంటే ఆ ప్రాజెక్టు గొప్పతనమేందో ప్రపంచానికి సైతం తెలిసిపోయింది కదా!

ప్రతిపక్షాలంటే భయమేది?

లక్షన్నర కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ లోపం ఉన్నా అది తెలంగాణ ప్రజలకు  నష్టం తప్ప, కేసీఆర్​కో, ప్రతిపక్షాలకోకాదు! అందుకేనేమో ప్రతిపక్షాలు అదో చిన్న సంఘటనలాగా ‘మమ’ విమర్శలతో సరిపెడుతున్నాయి! రెండో నిర్మాణ లోపం బయట పడ్డాకనైనా, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన రాజకీయ ఆందోళన రావచ్చనుకున్నాం! అందునా ఇది ఎన్నికల సమయం కూడా! ఈ విషయంలో ప్రతిపక్షాలను చూసి  కేసీఆర్​ ప్రభుత్వం భయపడుతున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తున్నదా? అంటే లేదనే చెప్పాలె! ఒకవైపు నింపాదిగా ఎన్నికల టికెట్ల పంపకంలో ప్రతిపక్షాలు మునిగితేలుతున్నాయి. 

కాళేశ్వరంపై ఒకప్పుడు ఒంటికాలిపై లేచి, దాంట్లో అవినీతి జరిగిందని, దాని నిర్మాణం లోపభూయిష్టమని, దాని డిజైనే తప్పని మాట్లాడిన ప్రతిపక్షనేతల సీరియస్​నెస్​ ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు లోప భూయిష్ట నిర్మాణంపై ఉద్యమించి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మించిన అవకాశం ప్రతిపక్షాలకు ఇంకేముంటది? తెలంగాణ రాజకీయాలు అవినీతి అరుపులకు పరిమితమైతున్నాయి. ప్రతిపక్షాలకు కేసీఆర్​ భయపడుతున్నాడా? కేసీఆర్​కు ప్రతిపక్షాలు భయపడుతున్నాయా? అర్థంకాని పరిస్థితి కనిపించడంలేదా?

రాహుల్​ కాళేశ్వరం వెళ్లి ఉండాల్సింది!

80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అని రాహుల్​ గాంధీ ఎలా అంటున్నారని మంత్రి కేటీఆర్​ తన ఎక్స్​లో ప్రశ్నించారు. అలాగే, మంథని దాకా వెళ్లారు..పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కూడా సందర్శించండని కేటీఆర్​ రాహుల్​కు వ్యంగ్యంగా​ సలహా ఇచ్చారు. గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్​ అద్భుతాన్ని చూసి తరించమన్నాడు. గోదావరిని తెలంగాణ మాగాణంలోకి ఎలా మళ్లిస్తున్నామో  అర్థం చేసుకొమ్మన్నారు. అరవైఏండ్ల కాంగ్రెస్​ పాలనలో తెలంగాణ రైతులు అరిగోస పడ్డారని ఎగతాళి చేశారు. నిజానికి కేటీఆర్​ చెప్పినట్లుగా రాహుల్​ గాంధీ కాళేశ్వరం సందర్శించి వచ్చి ఉండాల్సింది. 

ఎందుకంటే, కాళేశ్వర మంతా నిషేధిత ప్రాంతంగా మార్చిన విషయం అందరికీ తెలిసేది. తెలంగాణ మాగాణానికి గోదావరి నీళ్లు ఎన్ని పరిగెడుతున్నాయో, కేటీఆర్​ గొప్పలేమిటో, గప్పాలేమిటో లోకానికి తెలిసేది. నిజంగా రాహుల్​ గాంధీ కాళేశ్వరం వెళ్లిఉంటే.. రాజకీయంగానూ తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేది! భవిష్యత్తులో కూడా కాంగ్రెస్​ బీఆర్​ఎస్​ కలిసి పనిచేయవని! ఆ క్లారిటీని రాహుల్​ చేజేతులా కోల్పోయారు. ఎందుకో తెలియదు!  తుక్కుగూడలో కాంగ్రెస్​ పార్టీ తరఫున 6 గ్యారంటీలు చెప్పి వెళ్లారు. కానీ 7వ గ్యారంటీగా కాళేశ్వరం నిర్మాణ లోపాలపై, అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామనే హామీ ఎందుకు ఇవ్వలేకపోయారనేదే విజ్ఞుల ఆశ్చర్యం!

మోదీకి పొలిటికల్​ క్లారిటీ ఉండాలె

జరిగిన సంఘటనపై నిజానిజాలు తేలాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి భష్ట్రాచార్​, పరివార్​ వాద్​ పై మాట్లాడిపోవడం ఒక రివాజుగా మార్చుకున్నారు. ఆ మధ్య నిజామాబాద్​ సభలో ‘రాష్ట్రంలో మేము  అధికారంలోకి వస్తే, కేసీఆర్​ ప్రభుత్వ అవినీతిని వెలికితీసి ప్రజల కాళ్ల ముందు పడేస్తామని చాలా ఘాటుగా చెప్పారు. నిజానికి కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రమే కేసీఆర్​ పాలనా అవినీతిపై దర్యాప్తు జరుపుతామని చెప్పడమే ఒక విచిత్రంగా 
ప్రజలు భావిస్తున్నారు! 

రహస్య పాలన! 

కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడ్డ రెండో నిర్మాణ లోపం. ముందు ముందు ఎన్ని నిర్మాణ లోపాలను చూస్తామో ఎవరికీ తెలియదు. పంప్​ హౌస్​ సేఫ్టీ వాల్​ కూలిపోయి బాహుబలి మోటర్లు దెబ్బతిన్నపుడు సైతం ఎవరినీ అక్కడికి అనుమతించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టునే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు. పారదర్శక పాలనే అయితే మీడియాను సైతం ఎందుకు అనుమతించలేదో  కేసీఆర్​ ప్రభుత్వం ఇప్పటికీ చెప్పడంలేదు. 

కేసీఆర్​ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ జవాబుదారీగా వ్యవహరించ లేదు. ప్రజలే కేసీఆర్​కు జవాబుదారులుగా బతకాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. కేసీఆర్​ పాలనే ఒక రహస్య పాలనగా మారిపోయింది. పరిపాలనలో పారదర్శకత మచ్చుకు కనిపించదు. ప్రభుత్వ వెబ్​సైట్​లో పెట్టకుండా సుమారు 80 వేల జీవోలు దాచిపెట్టిన ప్రభుత్వమిది! ఈ విషయం కోర్టు వ్యాఖ్యానిస్తేగానీ బయటి ప్రపంచానికి తెలియలేదు. అలాంటి ప్రభుత్వ పారదర్శకతను కాళేశ్వరం నిర్మాణ లోపాలపై ప్రజలు అనుమానించడం సహజం!

అవినీతిపై ప్రతిపక్షాల హామీ?

ప్రతిపక్షాలుగా కాంగ్రెస్​, బీజేపీలు కేసీఆర్​ ప్రభుత్వ అవినీతి పట్ల అరుపులే తప్ప దర్యాప్తులపై క్లారిటీ ఇవ్వకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్​ పార్టీ తన మెనిఫెస్టోలోనైనా కాళేశ్వరం  నిర్మాణాలపై, అవినీతిపై దర్యాప్తు జరుపుతామనే హామీ ఇస్తుందా లేదా చూడాలె. అలాగే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఆ విషయాన్ని రాష్ట్ర పరిధికే పరిమితం చేసి మాట్లాడుతుండటం శోచనీయం. కాళేశ్వరంలో ఇన్ని నిర్మాణ లోపాలు బయట పడుతున్నా, వాటిపై ఏమేరకు దర్యాప్తు చేసి తన నిజాయితీని చాటుకోనుందనేదే బీజేపీకి తెలంగాణ ప్రజలు పెడుతున్న ఒక పరీక్ష అని చెప్పాలె. జాతీయ రాజకీయ అవసరాల రీత్యా  తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణ లోపాలపై, అవినీతిపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా నష్టపోయేది తెలంగాణ ప్రజలే అన్న విషయం  కాంగ్రెస్​, బీజేపీలు గుర్తుంచుకోవాలె. అవి చరిత్రలో  చెరగని తప్పిదాలుగా తమను వెంటాడుతాయని కూడా ఆ రెండు పార్టీలూ గమనించాలె.

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​