కరువుపై బీఆర్ఎస్ తొండాట.. 

కరువుపై బీఆర్ఎస్ తొండాట.. 
  • నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాట
  • కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం
  • మూలకుపడ్డ కాళేశ్వరం.. ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్
  • నిరుటి నుంచే రాష్ట్రంలో కరువు ఛాయలు.. 
  • అయినా అంతా కొత్త సర్కారు వల్లే అని నిందలు 

హైదరాబాద్, వెలుగు : సాగు, తాగునీటి అంశాలపై బీఆర్​ఎస్​ తీరు ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులన్నీ చేసేసి కరువు పరిస్థితులకు కారణమైన ఆ పార్టీ.. రివర్స్​లో నిందలు మోపుతున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బుంగలు, కృష్ణా నీళ్లలో వాటా రావాల్సి ఉన్నా పోరాడకుండా కాడి వదిలేయడం, మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాడటం, పంట నష్టపోతే రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోవడం వంటి తప్పులు చేసి.. ఇప్పుడు లొల్లి పెడ్తున్నది. 

లక్ష కోట్లు పెట్టి కట్టి..!

కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లందిస్తామంటూ కేసీఆర్​తో పాటు అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్​, హరీశ్​ సహా ఇతర నేతలు చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టుతో అసలు 15 లక్షల ఎకరాలకైనా నీళ్లివ్వలేదని తేలిపోయింది. వేలాది టీఎంసీల నీళ్లను వట్టిగా సముద్రం పాల్జేశారు. కోటిఎకరాల మాగాణి అన్న నినాదం ఉత్త మాటలకే పరిమితమైంది. దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇప్పుడు పడావు పడే పరిస్థితికి వచ్చింది. ఇందుకు కారణం నాసిరకం పనులేనని నిపుణులు చెప్తున్నారు. కన్నెపల్లి పంపుహౌస్​ మునక దగ్గర్నుంచి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు దాకా కాళేశ్వరం నాణ్యత ఎలాంటిదో తేల్చిచెప్తున్నది. 

  • కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత డొల్లనో 2022 జులై 14న వచ్చిన వరదలతో బయటపడింది. ఎంతటి వరదనైనా తట్టుకునేలా పటిష్ఠంగా ప్రాజెక్టును కట్టామని గొప్పలు చెప్పుకున్నా..  ఒక్క వరద దెబ్బకు కన్నెపల్లి పంప్​హౌస్​ ప్రొటెక్షన్​ వాల్​ కూలిపోయి మోటార్లన్నీ దెబ్బతిన్నాయి. క్రేన్లు, గోడలు కూలి వరదల్లో మునిగి 17 మోటార్లలోని ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగతా 11 మోటార్ల పరిస్థితిని ఏ ఒక్కరికీ గత ప్రభుత్వం తెలియనివ్వలేదు. ఆ ఏడాది డిసెంబర్​ నాటికి ఆరు మోటార్లను ట్రయల్​ రన్​ చేసి వారం పాటు ఎత్తిపోసి బంద్​పెట్టారు. ఆ తర్వాత దాన్ని గత బీఆర్​ఎస్​ సర్కార్​ పట్టించుకున్న పాపాన పోలేదు. 

15 నెలల పాటు ఒక్క టీఎంసీ నీళ్లనూ ఎత్తిపోయలేదు. డ్యామేజీ అయిన మోటార్లను రిపేర్​ చేయలేదు. సాగుకు నీళ్లు అందించలేదు. పైగా వరదలు వచ్చి పంపుహౌస్​ మునిగిపోతే.. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రతిపక్షాల నేతలు వెళ్తే  పోలీసులను పెట్టి అడ్డుకున్నది. ప్రపంచంలోనే అతిగొప్ప ప్రాజెక్ట్​ కాళేశ్వరం అని చెప్పి బస్సులు పెట్టి టూరిస్టులను తీసుకెళ్లినట్టు తీసుకెళ్లిన అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​.. పంప్​హౌస్​లు మునిగితే చూడ్డానికి వెళ్లిన ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకున్నది. పంపులు మునిగినప్పటి నుంచి ఆ ఏరియాను నిషేధిత ప్రాంతంగా మార్చింది. 

  •   కాళేశ్వరం ప్రాజెక్ట్​లో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్​ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని ఏడో బ్లాక్​లో ఉన్న 19, 20, 21 పిల్లర్లు ఐదు అడుగుల మేర కుంగిపోయాయి. బ్యారేజీ వీ ఆకారంలోకి మారిపోయింది. అప్పటికే బ్యారేజీలో ఉన్న 10 టీఎంసీల నీళ్లను ఎలాంటి ఉపయోగం లేకుండా సముద్రంలోకి వదిలేసి బ్యారేజీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆ రోజు నుంచి ఇప్పటివరకు మేడిగడ్డలోని 85 గేట్లను తెరిచే ఉంచాల్సి వస్తున్నది. ప్రాణహిత నుంచి వస్తున్న ఇన్​ఫ్లోను పూర్తిగా కిందికే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆనాటి బీఆర్​ఎస్​ పాలకుల తప్పుడు డిజైన్ల ఫలితమే అని రిటైర్డ్​ ఇంజనీర్లు అంటున్నారు. ఇప్పటికే ఆ బ్యారేజీని పరిశీలించిన నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) అధికారులు కూడా ప్రాథమికంగా ఇదే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
  •   మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కొద్ది రోజులకే అన్నారం బ్యారేజీకి బుంగలు పడ్డాయి. 2023 నవంబర్​ 1న బ్యారేజీలోని పది చోట్ల పిల్లర్ల కింద బుంగలు పడి నీళ్లు బయటకు లీకయ్యాయి. బ్లాక్​ నంబర్​ 4లోని 38వ గేట్​కు ఎదురుగా 4, 5వ పియర్ల మధ్య ఏర్పడిన బుంగ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. టెంపరరీగా అధికారులు ఇసుక బస్తాలు వేసి సీపేజీని ఆపగలిగారు. వాటితో పాటు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3లో 28వ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా 5, 6వ పిల్లర్ల  మధ్యన, ఇదే బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 31వ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా 8, 9వ  పిల్లర్ల  మధ్యన, బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4లో 33 వ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా 3, 4వ పిల్లర్ల దగ్గర కూడా పెద్ద, పెద్ద బుంగలు పడ్డాయి. వీటితో పాటు మరో 6 చోట్ల కూడా బ్యారేజీ పొడవునా పిల్లర్ల కింద బుంగలు పడి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వృథాగా కిందికి వెళ్లిపోయింది. అప్పటికే ఆ బ్యారేజీలో 8 టీఎంసీల నీళ్లున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేయాలన్న ఉద్దేశంతో 6 టీఎంసీలను వృథాగా కిందికి వదిలేయాల్సి వచ్చింది.  టెంపరరీగా ప్రాబ్లమ్​ పరిష్కారం అయిందనుకునేలోపే ఈ ఏడాది ఫిబ్రవరి 16న బ్యారేజీ 38వ పిల్లర్​ కింద మరోసారి పెద్ద బుంగ పడి వాటర్​ లీకైంది. దీంతో విషయాన్ని ఎన్​డీఎస్​ఏ అధికారులకు తెలుపగా.. రాత్రికి రాత్రి 2 గేట్లను తెరిచి నీళ్లను వదిలేయాల్సి వచ్చింది. అప్పటికే ఉన్న మిగతా 2 టీఎంసీల నీటినీ వదిలేయడంతో ఆ బ్యారేజీ కూడా ఎండిపోయింది. 

మూడు బ్యారేజీలూ ఓపెన్​ చేయాల్సిందే..

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు జరిగిన డ్యామేజీ కారణంగా వచ్చే వానాకాలంలోనూ నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజీనీ ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ పరిశీలించింది. డ్యామేజీకి గల కారణాలపై  అధికారుల నుంచి వివరాలను సేకరించింది. కమిటీ నివేదిక రావాల్సి ఉంది. అప్పటి వరకు రిపేర్లు చేసే పరిస్థితి లేదని, మూడు బ్యారేజీల గేట్లనూ వచ్చే ఫ్లడ్​ సీజన్​ వరకూ తెరిచి ఉంచాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వరదలతో దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​ల పరిస్థితి ఏమిటో కూడా ఇప్పటికీ తెలియదు. వాటి నుంచి నీళ్లను ఎత్తిపోయలేమని రిటైర్డ్​ఇంజినీర్లు అంటున్నారు.

కృష్ణా నీళ్లపైనా పోరాడలే..

కృష్ణా నీళ్ల వాటాలో హక్కుగా రావాల్సిన నీళ్లపైనా గత బీఆర్​ఎస్​ సర్కార్​ పోరాడలేదు. పోతిరెడ్డిపాడుకు బుంగపెట్టి నీళ్లను ఏపీ దోచుకెళ్లిపోతున్నా నోరు మెదపలేదు. శ్రీశైలం బ్యాక్​వాటర్​లో డెడ్​స్టోరేజీ కింది నుంచి కూడా నీళ్లను తోడేసుకునేలా పక్క రాష్ట్రం సంగమేశ్వరం ప్రాజెక్టును కట్టినా చూస్తూ ఊరుకున్నది.  పైగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తామంటూ ఏపీకి వెళ్లిమరీ నాడు  సీఎం హోదాలో కేసీఆర్​ చెప్పి వచ్చారు. ఏపీ నీళ్ల దోపిడీకి నాటి బీఆర్​ఎస్​ సర్కార్​ సహకరించింది. పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నీళ్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాను కోరాల్సి ఉన్నా.. 64 (ఏపీ): 36(తెలంగాణ) వాటాకు ఒప్పుకున్నారు. ఆ వాటాకు తగ్గట్టుగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే అంగీకరించారు.

 దీంతో రాష్ట్ర సాగు నీటి అవసరాలకు భారీగా గండిపడింది. ఉన్న వాటాలోనైనా వాడుకున్నదా అంటే అదీ లేదు. ఏ వాటర్​ ఇయర్​లోనూ పూర్తిగా వాటా నీళ్లను వాడుకోలేదు. వాటాలో మిగిలిన జలాలను క్యారీ ఓవర్​ చేయించుకోలేదు.  కనీసం తాగునీటి అవసరాలకూ నీటిని తెచ్చుకోలేని స్థితికి గత బీఆర్​ఎస్​ సర్కార్​ తీసుకొచ్చింది. తాగునీటి కోసం కేఆర్​ఎంబీకి ప్రస్తుత ప్రభుత్వం రిక్వెస్ట్​ పెట్టినా.. ఇప్పటికే వాటా వాడేసుకున్నారన్న రిప్లై వచ్చింది. కనీసం క్యారీఓవర్​ నీళ్లు 18 టీఎంసీలైనా ఇవ్వాలని కోరినా బోర్డు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం గత బీఆర్​ఎస్​ సర్కార్​ చేసిన తప్పిదాలేనని రిటైర్డ్​ ఇంజనీర్లు అంటున్నారు.

సంగమేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ పెట్టిన మీటింగులకూ సీఎంగా నాడు కేసీఆర్​ హాజరు కాలేదు. ఫలితంగా ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించారని రిటైర్డ్​ ఇంజినీర్లు అంటున్నారు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ లేఖ రాసింది కూడా ఆనాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వమే.  

నిరుటి నుంచే కరువు ఛాయలు

కాంగ్రెస్​ వచ్చింది.. కరువు తెచ్చిందంటూ బీఆర్​ఎస్​ నేతలు కేటీఆర్​, హరీశ్​ రావు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కరువు ఛాయలు గత బీఆర్​ఎస్​ హయాంలోనే మొదలయ్యాయి. నిరుడు యావరేజ్​ వర్షపాతం నమోదైనప్పటికీ.. అది స్ప్రెడ్​ కాలేదు. నాలుగు నెలలు కురవాల్సిన వర్షాలు.. పది రోజుల వ్యవధిలోనే కురిశాయి. పైనుంచి వరదలు కూడా ప్రాజెక్టుల్లోకి రాలేదు. దీంతో కేవలం తాగునీటి అవసరాలకే నీటిని వాడుకోవాలన్న నిబంధనను కేఆర్​ఎంబీ పెట్టింది. బీఆర్​ఎస్​ హయాంలో మొదలైన కరువు ఛాయలు.. ఇప్పటికీ కొనసా గుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో ప్రాజెక్టుల్లో నీళ్లు కరువవుతున్నాయి.  

జంట జలాశయాలను పట్టించుకోలే

హైదరాబాద్​కు తాగునీటి సరఫరాలో కీలకమైన జంటజలాశయాలు ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​ను గత సర్కార్​ పట్టించుకోలేదు. పైగా ఎకో సెన్సిటివ్​ జోన్​లో ఉన్న ఆ చెరువుల ఏరియాల్లో  111 జీవోను ఎత్తేసింది. ఫలితంగా ఆక్రమణలు పెరిగిపోయి ఆ రెండు చెరువులకు నీళ్లు వచ్చే దారులు మూసుకుపోతున్నాయి. సిటీకి తాగునీటి గండమూ ఏర్పడింది. ఇటు ఎప్పటి నుంచో సిటీకి మంజీరా నీళ్లను సరఫరా చేసేవారు. కానీ, ఆనాటి బీఆర్​ఎస్​ ప్రభు త్వం మాత్రం దానినీ పట్టించుకోలేదు.