వరద తగ్గాకే మేడిగడ్డ ప్రాజెక్ట్ టెస్టులు..బ్యారేజ్ ను పరిశీలించి అభిప్రాయపడిన పుణె సైంటిస్ట్ ల టీమ్

వరద తగ్గాకే మేడిగడ్డ ప్రాజెక్ట్ టెస్టులు..బ్యారేజ్ ను పరిశీలించి అభిప్రాయపడిన పుణె సైంటిస్ట్ ల టీమ్

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పుణె సైంటిస్టుల టీమ్ గురువారం సందర్శించింది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యారేజీ వద్ద చేపట్టాల్సిన పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. సైంటిస్ట్ సరబ్జీత్ సింగ్ ఆధ్వర్యంలో సీడబ్ల్యూపీఆర్ఎస్ కు చెందిన వివిధ విభాగాలకు చెందిన సైంటిస్ట్ లు టీమ్ లో ఉండగా..  మేడిగడ్డ బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ లో ఏర్పాటు చేసిన వాక్ వే పైకి వెళ్లి ఏడో బ్లాక్ లో కూలిన పిల్లర్లను చూసింది. 

బ్రిడ్జిపై నుంచి గోదావరి వరద ప్రవాహం చూసి  టెస్టులు సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. ల్యాబ్ లో చేసుకునే చాన్స్ ఉన్న టెస్టులు మాత్రమే ఇప్పుడు చేసుకోవచ్చని, ఫీల్డ్ లో చేయాల్సినవి వరద తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్ లో చేసే చాన్స్ ఉండొచ్చని పేర్కొంది. ఇంజనీర్లు తిరుపతిరావు, సురేశ్ బ్యారేజీ పరిస్థితులను సైంటిస్టులకు వివరించారు.  

మంగళవారం సుందిళ్ల బ్యారేజీని, బుధవారం అన్నారం బ్యారేజీని సందర్శించింది. కాగా బ్యారేజ్ వద్ద బుధవారం వరకు నిలకడగా కొనసాగిన ఇన్ ఫ్లో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది.  మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉదయం 1,06,640 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా సాయంత్రానికి 2,30,890 క్యూసెక్కులకు పెరిగింది . బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి ఫ్రీ ఫ్లో కండీషన్ లో వాటర్ డిశ్చార్జ్ చేస్తున్నారు.