తీన్మార్ మల్లన్నను జడ్జి ఎదుట హాజరుపర్చిన మేడిపల్లి పోలీసులు

తీన్మార్ మల్లన్నను జడ్జి ఎదుట హాజరుపర్చిన మేడిపల్లి పోలీసులు

తీన్మార్ మల్లన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని మేడిపల్లి పోలీసులు ఎట్టకేలకు రిలీజ్ చేశారు. 148, 307, 342,506, 384, 109,r/w 149 ఐపీసీ కింద మొత్తం 7 కేసులు నమోదైనట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అనంతరం మేడిపల్లి పోలీసులు, మల్లన్నను హయత్ నగర్ లో జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఇక ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించగా... రావనకల్ సాయి కరణ్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై ఈ కేసులు ఫైల్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

తాను 19.03.2023 మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో ఈ న్యూస్ కార్యాలయానికి వెళ్లానని.. బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు, అసత్య ప్రచారం ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగినానని సాయి కరణ్ గౌడ్ కంప్లైంట్ లో తెలిపారు. అలా నిలదీసినందుకు క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్భందించి, కర్రలతో కొట్టారని, విచక్షణారహితంగా తిట్టారని ఆరోపించారు. తన జేబులో ఉన్న నగదు, మెడలోని చైన్, చేతికున్న ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారని అన్నారు. అప్పుడే పోలీసులు రావడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని కంప్లైంట్ ఇచ్చారు సాయి కరణ్. 

అంతకుముందు తీన్మార్ మల్లన్న భార్య మమత తన భర్త ఆచూకీ తెలపాలని కుటుంబసభ్యులు, లాయర్లతో కలిసి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదని, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్నారు. తన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చినట్టు మమత స్పష్టం చేశారు.