హైదరాబాద్: రాజ్య సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను నామినేషన్లో ఆమె వెల్లడించలేదని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది.
కాగా, మధ్యప్రదేశ్లో మూడు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం రెండు స్థానాలను బీజేపీ సునాయాసంగా కైవసం చేసుకోనుండగా.. ఒక స్థానం కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఈ మూడో సీటు కోసం కాంగ్రెస్ తరుఫున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, హైదరాబాద్లో నమోదైన క్రిమినల్ కేసు వివరాలు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీల వివరాలను ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో దాచిపెట్టారని బీజేపీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు.
►ALSO READ | కూతుళ్ల చదువుకు పైసలివ్వనన్న తండ్రి.. రూ.46 లక్షలు కట్టాల్సిందేనని కోర్టు కీలక తీర్పు
ఈ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిజెక్ట్ చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ పరిశీలన ప్రక్రియలో తిరస్కరణకు గురి కావడంతో మధ్యప్రదేశ్లోని మూడవ రాజ్యసభ స్థానానికి కూడా పోటీ ముగిసింది. బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఈసీ ప్రకటించింది. నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
