
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. ఆ రాష్ట్ర రోడ్డు -రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనే మహిళ, అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నిలిచారు. తాగుడుకు బానిసైన ప్రియాంక భర్త... పెళ్లయిన కొద్ది రోజులకే మరణించాడు. దాంతో తన ఇద్దరి పిల్లలను పోషించే బాధ్యత ప్రియాంకపై పడింది. తన భర్త చనిపోయాక పిల్లలను పోషించే బాధ్యత అంతా తనపైనే పడిందని ప్రియాంక ఈ సందర్భంగా చెప్పారు. అవకాశాల కోసం తాను ఢిల్లీకి వెళ్లానని, మొదట్లో తనకు ఓ ఫ్యాక్టరీలో హెల్పర్ గా ఉద్యోగం వచ్చిందన్నారు. ఆ తర్వాత డ్రైవర్ గా మారానని, డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ముంబయి, బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాలకు కూడా వెళ్లానన్నారు.
మహిళా డ్రైవర్లు తమ కాళ్ల మీద నిలబడేందుకు ఓ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని మోడీకి, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లతు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. 2020లో మహిళా డ్రైవర్ల కోసం రిలీజైన ఉద్యోగ ఖాళీలకు తాను దరఖాస్తు చేశానని, మే లో శిక్షణలో ఉత్తీర్ణత సాధించి, సెప్టెంబర్ లో పోస్టింగ్ పొందానని ప్రియాంక తెలిపారు. తన జీతం తక్కువగా ఉన్నప్పటికీ, అందరి నుంచీ మంచి పేరు లభిస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.