14 అంశాలతో మీటింగ్ ఎజెండా

14 అంశాలతో మీటింగ్ ఎజెండా

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 27న ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనుంది. దీనికి తెలంగాణ నుంచి సీఎస్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విభజన అంశాల కమిటీ ప్రతినిధులు హాజరుకానున్నారు. 14 అంశాలతో మీటింగ్ ఎజెండాను తయారు చేశారు. ఇప్పటికే విద్యుత్ బకాయిల చెల్లింపుపై రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతోంది. గత నెలలో తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్​లో ఈ అంశాన్ని ఏపీ లేవనెత్తగా తెలంగాణ రాత పూర్వకంగా సమాధానం పంపుతామని తెలిపింది. ఇందులో ప్రధానంగా నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ చేయాల్సినవాటిని ఇతర మంత్రిత్వ శాఖలు చేస్తున్నాయని, ఇది సరికాదని తెలంగాణ స్పష్టం చేసింది.

ఇప్పుడు మళ్లీ విద్యుత్ బకాయిలపై చర్చ జరిగే చాన్స్ ఉన్నది. దీంతో పాటు సింగరేణి కాలరీస్, దానికి అనుబంధంగా అప్మెల్, విభజన చట్టంలోని 9, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన, పలు సంస్థల మధ్య ఆస్తుల, అప్పుల పంపిణీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విభజన, సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాలకు సంబంధించిన తెలంగాణ నిధులు ఏపీ బ్యాంక్  ఖాతాల్లో జమ కావడం వంటివి చర్చించి పరిష్కార మార్గాలు కనుగొననున్నారు. కాగా, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటు చేసే అంశంపై కూడా మీటింగ్​లో చర్చించే అవకాశం ఉంది. రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటు, పోలవరం బ్యాక్‌‌ వాటర్‌‌తో భద్రాచలం సహా సమీప ప్రాంతాల ముంపు, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీంపై కూడా చర్చించనున్నారు.