- బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే పార్టీ మారినట్టేనా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంను కలిశానని స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ మారుతున్నానన్న వార్తలను కొట్టి పారేశారు. తమ పార్టీలోనే పలువురు ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తూ, బహిరంగంగా ప్రశంసిస్తున్నారని చెప్పారు.
వారిపై చర్చ లేకుండా తనపైనే ఆరోపణలు చేయడం తగదన్నారు. మల్కాజిగిరి అభివృద్ధికి ఫ్లైఓవర్ కోసం రూ.210 కోట్లు, రింగ్ రోడ్డుకు రూ.910 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సీఎంను కలిసిన ప్రతిసారి ఫొటోలు బయటపెడుతున్నానని, అదే కొందరికి ఇబ్బందిగా మారిందన్నారు. తమ కుటుంబం విజయంలో తన అత్తమ్మ పాత్ర గొప్పదని కొనియాడారు.
