హైదరాబాద్, వెలుగు: 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఆ పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశం ఈ నెల 9న హైదరాబాద్లో జరగనుంది. అయితే వేదిక ఎక్కడనేది ఇంకా ఖరారు కాలేదు. పార్టీ స్టేట్ ఆఫీసులోనా లేదంటే సిటీ శివారు ప్రాంతంలోనా అనే దానిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న మరికొన్ని రాష్ట్రాల నేతలు ఇందులో పాల్గొననున్నారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
నిజానికి ఈ మీటింగ్ ఈ నెల 8న జరగాల్సి ఉంది. అయితే అదే రోజు తెలంగాణకు ప్రధాని మోదీ రానుండడంతో 9కి వాయిదా వేశారు. మోదీ పర్యటన తెల్లారే నడ్డా హైదరాబాద్కు రానుండడంతో వరుసగా రెండ్రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల టూర్ ఉండనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం, త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై మీటింగ్లో చర్చించనున్నారు.
