త్రిముఖ వ్యూహంతో పోరుకు సై

త్రిముఖ వ్యూహంతో పోరుకు సై
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా బీజేపీ కార్యాచరణ
  • బూత్​ లెవల్​ నుంచి పార్టీ బలోపేతానికి నిర్ణయం
  • పార్టీలోకి చేరికలను ప్రోత్సహించడం
  • కేసీఆర్​ వైఫల్యాలను ఎండగట్టడం
  • మోడీ విజయాలను జనంలోకి తీసుకెళ్లడం
  • రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన జాతీయ నేతలు
  • 5 గంటలపాటు సాగిన ఆఫీసు బేరర్ల సమావేశం

హైదరాబాద్ :  పార్టీని బూత్​ లెవల్​ నుంచి మరింత పటిష్టపర్చి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. టీఆర్​ఎస్​ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపింది. ప్రతి నెలా 20 రోజులు పాదయాత్ర చేయాలని, మరో పదిరోజులు పార్టీ కార్యక్రమాల్లో ఉండాలని సూచించింది. సోమవారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో జరిగిన రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో బీజేపీ  బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేరికలను ప్రోత్సహించడం, మూడో విడత, నాలుగో విడత పాదయాత్రపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, పార్టీ సంస్థాగత జాతీయ సహ కార్యదర్శి శివ ప్రకాశ్​తో పాటు బండి సంజయ్​, కిషన్​రెడ్డి, లక్ష్మణ్​, వివేక్​ వెంకటస్వామి, మురళీధర్​రావు, జితేందర్​రెడ్డి, పొంగులేటి సుధాకర్​రెడ్డి తదితర ముఖ్య నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్​చార్జులు పాల్గొన్నారు.  బీజేపీలోకి చేరికలు అనేది నిరంతర ప్రక్రియలా సాగాలని, చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని, పైగా జాయినింగ్స్ తో రాష్ట్రంలో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని తరుణ్​ చుగ్​, శివ ప్రకాశ్​ దిశానిర్దేశం చేశారు. 

ఇదీ వ్యూహం
చేరికలను ప్రోత్సహించడం. ఈ విషయంలో ఎవరిని, ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని బీజేపీ రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు తరుణ్​ చుగ్​, శివ ప్రకాశ్​ సూచించారు. పాత వారిని సమన్వయం చేసుకుంటూ కొత్త వారికి కూడా పార్టీ బాధ్యతలను అప్పగించాలని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర స్థాయి నేతల చేరికల విషయాన్ని మాకు అప్పగించండి. జిల్లా స్థాయి, మండల స్థాయి నేతల చేరికలపై మీరు దృష్టి పెట్టండి” అని వారు సూచించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులను బీజేపీలోకి చేర్చుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు బీజేపీది అన్నట్లుగానే పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 

మోడీ ఎనిమిదేండ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టడం. మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు దేశంలో సుపరిపాలనపై ఈ నెల30 నుంచి జూన్ 14 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ నేతలు సూచించారు. అవినీతికి తావులేకుండా సాగుతున్న మోడీ పాలనను, తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి వివరించాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన సహాయ సహకారాలను, ఇచ్చిన నిధులను వివరించాలని స్పష్టం చేశారు. డబుల్​ ఇంజిన్​ సర్కార్​తో కలిగే ప్రయోజనాలు తెలియజేయాలని సూచించారు. టీఆర్​ఎస్​ సర్కార్​ వైఫల్యాలను ఎండగట్టడం. లీడర్లు నిత్యం ప్రజల మధ్య ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అంశాల వారీగా ఎండగట్టాలని జాతీయ నాయకులు సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టతపై నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆందోళనలు, నిరసనలు ఎక్కడికక్కడే చేసేలా స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 



బాధ్యతలు అందరికీ సమానం
పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా బాధ్యతలను అందరికీ సమానంగా అప్పగించాలని జాతీయ నేతలు సూచించారు. జైపూర్ లో ఇటీవల జరిగిన జాతీయ పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగానే ప్రస్తుత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని రాష్ట్ర నేతలకు చెప్పారు. వచ్చే నెల 23 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, ఆగస్టులోపు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభించి, ఎక్కడ ముగింపు ఇవ్వాలనే విషయంలో ఇంకా   నిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు. 

 

సోషల్​ మీడియాను వాడుకోవాలి
సోషల్ మీడియాను పార్టీ పటిష్టతకు బలమైన ఆయుధంగా వాడుకోవాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు సూచించారు. మోడీ అభివృద్ధి మంత్రాన్ని, సీఎం కేసీఆర్ అవినీతి మార్గాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.  ఎనిమిదేండ్లుగా కేంద్రంలో బీజేపీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లేలా సోషల్  మీడియాలో పార్టీ నేతలు యాక్టివ్ కావాల్సి ఉందని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, నియంత పోకడలు, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని కూడా ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా జనానికి తెలియజేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోలింగ్ టేబుల్ వద్ద ఎదురుగా ఇతర పార్టీల ఏజెంట్లు కనిపించని విధంగా బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లా కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయ భవనాలను పూర్తి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సరళిని సొంత భవనాల్లో చేసుకునేలా పార్టీ భవన నిర్మాణాల పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం : -

జూన్ 23 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర


హైదరాబాద్కు బయలుదేరిన సీఎం కేసీఆర్