రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వర్సిటీ లో  మెగా ప్లేస్‌‌మెంట్ డ్రైవ్

రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వర్సిటీ లో  మెగా ప్లేస్‌‌మెంట్ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో 2025–26 విద్యాసంవత్సరానికి మెగా ప్లేస్‌‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజీలో ఈ నెల 26 వరకు జరిగే ఈ కార్యక్రమంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న తొమ్మిది కాలేజీల యూజీ, పీజీ, పీహెచ్‌‌డీ విద్యార్థులు పాల్గొంటున్నారు. అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగాల స్టూడెంట్స్​కు ఈ డ్రైవ్ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు. 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించనున్నాయి.

ఇంత పెద్ద స్థాయిలో ప్లేస్‌‌మెంట్ డ్రైవ్ నిర్వహించడం వర్సిటీ చరిత్రలో ఇదే తొలిసారి. సోమవారం ఉదయం న్యూ అకాడమిక్ బ్లాక్‌‌లో కార్యక్రమం ప్రారంభమైంది. డీన్‌‌లు, రీసెర్చ్ డైరెక్టర్లు, కాలేజీ అధికారులు పాల్గొని స్టూడెంట్స్​కు మార్గనిర్దేశం చేశారు. మొదటి రోజు ఐదు సంస్థలు ప్రీ-ప్లేస్‌‌మెంట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 13 సంస్థలు ఎంపిక ప్రక్రియను ప్రారంభించాయి.