Chiranjeevi : రికార్డుల వేటలో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. రూ. 300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్న చిరు..!

Chiranjeevi : రికార్డుల వేటలో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. రూ. 300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచి, వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ మూవీ కేవలం మొదటి వారంలోనే రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ మేరకు లేటెస్ట్ గా ఈ చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

బాక్సాఫీస్ వద్ద 'మ్యాజిక్'

గత ఏడాది 'భోళా శంకర్' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. ఈ సంక్రాంతికి మాత్రం మెగాస్టార్ తన వింటేజ్ కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు తోడవ్వడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. కేవలం 7 రోజుల్లోనే రూ.292 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన ప్రాంతీయ చిత్రాల పరంగా ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు. రెండో వారంలోకి అడుగుపెడుతున్న ఈ చిత్రం అతి త్వరలోనే రూ.400 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోందంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాలో మాజీ NIA ఆఫీసర్ ప్రసాద్‌గా తన నటనతో, విక్టరీ వెంకటేష్ తన గెస్ట్ రోల్‌తో సినిమాకు ఆకర్షణగా నిలిచారు.  శశిరేఖ పాత్రలో నయనతార నటన సినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది.

Also Read : నాపై కుట్రకు నా భార్యను పావుగా వాడుకుంటున్నారు.. 

 

రెండు భారీ ప్రాజెక్టులతో రెడీ

'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ ఈసారి అంతకు మించిన మాస్ మసాలా కథను సిద్ధం చేశారు. ఈ సినిమా పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఇందులో చిరు రోల్ 'పూనకాలు' తెప్పించేలా ఉంటుందని సమాచారం. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉందని టాక్ వినిస్తోంది.

సోషియో ఫాంటసీ 'విశ్వంభర'

వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. చిరంజీవి తన బాబీ కొల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, వ్యక్తిగతంగా విశ్వంభర పనులను పర్యవేక్షిస్తున్నారని సమాచారం. దశాబ్దాల కాలంగా టాలీవుడ్‌ను ఏలుతున్న మెగాస్టార్, వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మరోవైపు భారీ సోషియో ఫాంటసీ చిత్రాలు, ఇంకోవైపు మాస్ యాక్షన్ డ్రామాలు.. ఇలా వైవిధ్యమైన సినిమాలతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.