Govinda: నాపై కుట్రకు నా భార్యను పావుగా వాడుకుంటున్నారు.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్!

Govinda: నాపై కుట్రకు నా భార్యను పావుగా వాడుకుంటున్నారు.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన గోవింద.. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొంతకాలంగా తన భార్య అహుజాతో విభేదాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రూమర్లపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న గోవింద, ఎట్టకేలకు నోరు విప్పారు. తన మౌనం తన బలహీనతగా మారుతోందని, తన కుటుంబం చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మౌనం బలహీనత కాదు!

తనపై వస్తున్న రూమర్స్ పై నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటే, అది నా బలహీనత అని అనుకుంటున్నారు. సమస్య అంతా నావల్లే అని భావిస్తున్నారు. అందుకే స్పందిచాల్సి వస్తుందని చెప్పారు గోవింద. నా కుటుంబ సభ్యులను నాకు తెలియకుండానే ఎవరో ఒక పెద్ద కుట్రలో పావులుగా వాడుకుంటున్నారు. తొలినాళ్లలో ఇది ఎవరికీ అర్థం కాదు, కానీ నెమ్మదిగా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

నా భార్య కుట్రలో చిక్కుకుంది.. 

తాను సినిమాలు రిజెక్ట్ చేస్తుంటే తన భార్య ఆందోళన చెందుతోందని, కానీ ఆమె కూడా ఈ కుట్రలో చిక్కుకున్న విషయం ఆమెకు తెలియడం లేదని గోవింద అన్నారు. నా ప్రతిష్టను దిగజార్చడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. సునీతను ఈ కుట్రలోకి ముందు వరుసలో ఉంచి నడిపిస్తున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమలో ఒక స్థాయికి మించి పాపులారిటీ వచ్చినప్పుడు, మనల్ని నాశనం చేయడానికి చాలా మంది సిద్ధమవుతారు. గతంలో కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తి నాపై అభాండాలు వేశాడు, కానీ చివరకు అతనే ఎక్స్‌పోజ్ అయ్యాడు అని గుర్తు చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినందుకేనా?

 కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న గొడవలపై గోవింద ఎమోషనల్ అయ్యారు. తన పిల్లలు టీనా, యశవర్ధన్ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నానని, ఇంట్లో ఊపిరి ఆడనంత ఒత్తిడికలగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు తాను శివసేనలో చేరిన తర్వాతే ఇలాంటి కుట్రలు ఎక్కువయ్యాయని గోవింద అభిప్రాయపడ్డారు. నేను రాజకీయాలోకి అడుగుపెట్టగానే నాపై ఇన్ని నెగిటివ్ వార్తలు రావడం వెనుక ఏదో మర్మం ఉంది. నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయడం లేదు, కేవలం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా గత కష్టాన్ని, పనిని మర్చిపోయి నన్ను బలహీనుడిగా భావించవద్దు అని ఆయన హెచ్చరించారు. దశాబ్దాల పాటు వెండితెరపై నవ్వించిన గోవింద.. ఇప్పుడు తన సొంత ఇంట్లోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది...