చిరంజీవి ’గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ తేదీ ఖరారు

చిరంజీవి ’గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ తేదీ ఖరారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న్యూ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ (Godfather) గురించి లెటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ (Konidela Pro Company) ట్వీట్ చేసింది. జూలై 04వ తేదీన సాయంత్రం 5.45 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల ఉంటుందని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడు ఈ సినిమాలో ఎలా కనిపిస్తారోనన్న ఉత్కంఠలో ఉన్నారు. ట్వీట్ చేసిన ఫొటోలో వర్షం పడుతుండగా.. కొంతమంది నల్ల రంగు కలిగిన గొడుగులు పట్టుకుని ఉన్నారు. ఎదురుగా ఓ కారు నిల్చొని ఉంది. దానికి ఎదురుగా ఎర్ర గొడుగు పట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ ఫొటో చిత్రంపై భారీ అంచనాలు పెంచేసింది. 

ఇక చిరంజీవి విషయానికి వస్తే... ఇటీవలే ’ఆచార్య’ కనిపించారు. తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అయిపోయారు. అందులో ‘గాడ్ ఫాదర్’ కూడా ఒకటి. చిరంజీవికిది 153వ సినిమా. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు ’సల్మాన్ ఖాన్’ కీలక పాత్రలో కనిపించనున్నారు. సల్మాన్ - చిరు మధ్య ఓ పాట ఉంటుందని.. ఈ పాట అభిమానులను కిర్రెక్కిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ డ్యాన్స్ కు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవ వ్యవహరించగా.. సంగీతం ఎస్. తమన్ అందించారు. నయన తార, పూరి జగన్నాథ్ లు కూడా స్పెషల్ రోల్స్ పోషించారు.