బ్లడ్ డొనేషన్‌‌ ఎనలేని సంతృప్తిని ఇస్తుంది: మెగాస్టార్ చిరంజీవి

బ్లడ్ డొనేషన్‌‌ ఎనలేని సంతృప్తిని ఇస్తుంది: మెగాస్టార్ చిరంజీవి

79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బుధవారం ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంస్థలు మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించాయి. చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొనగా తేజా సజ్జా, సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. ఇక్కడ సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలబెడుతున్న అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రక్తదానం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుంది.

ఇది నేను ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్. ఓ జర్నలిస్ట్‌‌ రాసిన ఆర్టికల్‌‌ స్ఫూర్తితో అభిమానుల్ని బ్లడ్ డొనేషన్ వైపు మళ్లిస్తూ నేను 27 ఏళ్ల క్రితం ఇచ్చిన పిలుపు ఈరోజు లక్షల మందిని రక్తదానం వైపు కదిలించింది. ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది.

రక్తదానం అనగానే నా పేరు స్ఫురించడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఆమధ్య ఓ పొలిటీషియన్‌ నాపై అవాకులు చవాకులు పేలితే ఓ మహిళ నిలదీసింది. ఒకప్పుడు మా బ్లడ్‌‌బ్యాంక్‌‌ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచినందుకు నేనంటే గౌరవంతో అలా చేసింది. అందుకే విమర్శలపై నేనెప్పుడూ స్పందించను. నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. ఇక ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు సురేష్‌‌కి ధన్యవాదాలు’అన్నారు.

రక్తదానం అంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి గారు.. ఆయనతో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని తేజ సజ్జా, సంయుక్త అన్నారు. ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా చిరంజీవి బ్లడ్‌‌ బ్యాంక్‌‌తో కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం.  భవిష్యత్తులో కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాం’ అని చెప్పారు.