మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, మాస్ యాక్షన్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ . ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ప్రియులకు, నిర్మాతలకు తీపి కబురు అందించాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. అదే బాటలో లేటెస్ట్ గా తెలంగాణ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
స్పెషల్ ప్రీమియర్స్ షోకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
‘మన శంకరవరప్రసాద్ గారు’ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపుతో పాటు జనవరి 11న ప్రత్యేక ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం... రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. ఈ ప్రత్యేక షోల టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు. జనవరి 12 నుండి రెగ్యులర్ గా ప్రదర్శించే షోలకు టికెట్ల ధర పెంపును వారం రోజుల పాటు వెసుల బాటు కల్పించింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఏపీలోనూ 'మెగా' జోరు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి భారీ వెసులుబాటు కల్పించింది. జనవరి 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య వేసే స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. ఈ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500గా నిర్ణయించారు. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు అదనపు ధరలకు అనుమతినిచ్చారు. సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కలిగింది. విడుదలైన తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని జీఓలో పేర్కొంది. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
వినోదం.. విలువల సమ్మేళనం
దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో చిరంజీవిలోని వింటేజ్ మాస్‌ని, కామెడీ టైమింగ్‌ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. 'సంక్రాంతి మొనగాడు'గా చిరంజీవి బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల వద్ద ఇప్పటికే పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయనుంది. విక్టరీ వెంకటేశ్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ,సర్ ప్రైజింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. మెగా-వెంకీ కాంబో అంటేనే థియేటర్లలో ఈలలు, గోలలు ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ బీట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
సంక్రాంతి రేసులో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ పై ఉన్న క్రేజ్ మరో స్థాయిలో ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి యాక్షన్ అన్నీ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. జనవరి 12న థియేటర్లు 'మెగా' సందడితో దద్దరిల్లబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
