మెగా వ్యాక్సినేషన్.. ఈ ఒక్కరోజే 40 వేల మంది టార్గెట్

మెగా వ్యాక్సినేషన్.. ఈ ఒక్కరోజే 40 వేల మంది టార్గెట్

హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. ఆదివారం ఒక్కరోజే 40 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. వ్యాక్సినేషన్ కోసం మూడు హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో వంద కౌంటర్స్ ఏర్పాటు చేసి 3 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. గంటకు 5 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నారు. నాలుగు వందల మంది వాలంటీర్లు, 300 మంది హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సినేషన్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 వేల మందికిపైగా వ్యాక్సినేషన్ పూర్తయింది.  కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. 

మార్నింగ్ 7.30 గంటలకే వ్యాక్సినేషన్ స్టార్ చేశామని మెడికవర్ ఎండీ అనీల్ కృష్ణ తెలిపారు. ‘ఇప్పటివరకు 20 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. పేపర్ లెస్ హాసల్ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. వ్యాక్సిన్ డ్రైవ్స్ వల్ల ప్రజల్లో కొంత అవగాహన వస్తుంది. సాధ్యమైనంత త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం’ అని ఆయన అన్నారు.  

కాగా.. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మాధాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా తప్పకుండా మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. రాష్ట్రంలో అందరికి వాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు అవకాశం ఇచ్చిందన్నారు. మెడికవర్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో జరుగుతున్న అతి పెద్ద వాక్సిన్ డ్రైవ్‌కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రజలు కేటాయించిన స్లాట్‌లలో వచ్చి వాక్సిన్ వేసుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారితో సైబర్ టవర్స్ జంక్షన్ పూర్తిగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో కిలో మీటర్‌‌కు పైగా వాహనాలు స్లోగా మూవ్ అవుతున్నాయని.. పోలీసులు ట్రాపిక్‌ను క్లియర్ చేస్తున్నారని సీపీ సజ్జనార్ అన్నారు. ‘వ్యాక్సినేషన్ సజావుగా సాగుతుంది. 500 మంది పోలీస్ సిబ్బంది ఈ డ్రైవ్‌ను పర్యవేక్షిస్తున్నారు. కొంత ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఒక్కసారిగా ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్‌కి రావడంతోనే ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అపోహలు పెట్టుకోకుండా ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.