హాస్య బ్రహ్మకి విషెస్.. ఇంటికెళ్లి సర్ ప్రైజ్ చేసిన చిరు

హాస్య బ్రహ్మకి విషెస్.. ఇంటికెళ్లి సర్ ప్రైజ్ చేసిన చిరు

వెండితెరపై కామెడీతో నవ్వులు పూయించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం ఈ రోజు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాదాపు వెయ్యికిపైగా సినిమాల్లో నటించి.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కిన ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా బ్రహ్మానందం ఇంటికెళ్లి గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేశారు. చిరు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

"నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్‌, ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్యనటుడు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయాల్సిన అవసరం లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరుతో పాటు హాస్య నటుడు అలీ, జబర్దస్త్ కమెడియన్లు కూడా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.