ఇయ్యాల సిమ్లాలో సభ్యుల భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపిక

ఇయ్యాల సిమ్లాలో సభ్యుల భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపిక
  • క్యాంప్ రాజకీయాలు షురూ!
  • శాసన సభాపక్ష నేతను ఎన్నుకోనున్న సభ్యులు
  • పరిస్థితిని సమీక్షిస్తున్న భూపేశ్​ బఘేల్, రాజీవ్​ శుక్లా

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్ గెలుపు కన్ఫామ్​ కావడంతో  హైకమాండ్ అలర్ట్ అయింది. చత్తీస్​గఢ్​​ సీఎం భూపేశ్​బాఘేల్, కాంగ్రెస్ ఇన్​చార్జ్​ రాజీవ్​శుక్లా, సీనియర్​ లీడర్​ భూపిందర్​ సింగ్ హుడాను హిమాచల్​కు పంపింది. ముగ్గురు కలిసి ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. సీఎం రేసులో ఐదుగురు ఉండటంతో దానిపైనా  చర్చించారు. అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ‘ఆపరేషన్​ లోటస్’కు తెరలేపే చాన్స్​ ఉండటంతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. సభ్యులందరినీ సిమ్లాకు పిలిపించుకున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్​ లేదా చండీగఢ్​​ తీసుకెళ్లాలనుకున్నారు. కానీ, మెజార్టీ భారీ గానే ఉండటంతో పాటు సభ్యులందరినీ క్యాంప్​కు తీసుకెళ్లాల్సి ఉండటంతో తరలింపు నిర్ణయాన్ని విరమించుకున్నారు. సిమ్లాలోనే అందరినీ ఉంచారు. శుక్రవారం ఎమ్మెల్యేలందరూ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.

అధిష్టానమే నిర్ణయిస్తుంది : బాఘేల్​

సీఎం కుర్చీ కోసం ఐదుగురు లీడర్లు పోటీ పడుతున్నారు. వారిలో ప్రతిభా సింగ్, సుఖ్విందర్​ సింగ్​ సుఖు, ముఖేశ్​ అగ్నిహోత్రి, కౌల్​సింగ్​ ఠాకూర్​తో పాటు ఆశాకుమారి ఉన్నారు. సీఎం ఎవరనేది కాంగ్రెస్‌ అధిష్టానమే నిర్ణయిస్తుందని భూపేశ్ ​బాఘేల్ మీడియాకు తెలిపారు. అయినా, పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు.. బీజేపీ వలలో పడకుండా కాంగ్రెస్​ జాగ్రత్తపడుతున్నది. సీఎం అభ్యర్థి ఎవరో డిసైడ్ అయ్యేదాకా అందరినీ ఒకే చోట ఉంచాలని భావిస్తోంది.  

ప్రతిభాసింగ్ వైపే హైకమాండ్ మొగ్గు!

సీఎం రేసులో హిమాచల్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. ప్రతిభా సింగ్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ భార్య. మండీ లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రతిభా సింగ్​నే సీఎంగా నామినేట్ చేసే అవకాశాలున్నాయి. ఆమె కొడుకు విక్రమాదిత్య సింగ్​ సిమ్లా రూరల్​ నుంచి పోటీ చేసి గెలిచారు. విక్రమాదిత్య సింగ్ తల్లికే మద్దతు పలికాడు.

ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పినయ్

ముప్పై ఏండ్లుగా ఒకదాని తర్వాత మరో పార్టీకి అధికారం కట్టబెడుతున్న హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని పాటించారు. అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్​కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఫైనల్​గా బీజేపీనే గెలిచే చాన్సెస్ ఉన్నాయని వెల్లడించాయి. 2 పార్టీలకు మెజార్టీ మార్క్(35)కు అటుఇటుగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫలితాల్లో అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్​కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 35 దాటి 40 సీట్లు దక్కించుకుంది.