కరోనాతో చనిపోయిన గాంధీ స్టాఫ్​కు మెమోరియల్

కరోనాతో చనిపోయిన గాంధీ స్టాఫ్​కు మెమోరియల్

పద్మారావునగర్, వెలుగు: కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తూ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన గాంధీ ఆస్పత్రి మెడికల్ స్టాఫ్, వాళ్ల కుటుంబసభ్యుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని డీఎంఈ రమేశ్ రెడ్డి అన్నారు. వాళ్ల జ్ఞాపకార్థం గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో మెమోరియల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసు నమోదై రెండేండ్లయిన సందర్భంగా బుధవారం గాంధీ ఆలమ్ని బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినోళ్లకు నివాళి అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. కరోనా టైమ్ లో డాక్టర్లు, మెడికల్ స్టాఫ్​అందించిన సేవలు మరిచిపోలేనివని రమేశ్ రెడ్డి అన్నారు. మీడియా, పోలీస్ సిబ్బంది సేవలనూ ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 85 వేల మంది కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్, 6 వేల మంది పాజిటివ్​గర్భిణులకు డెలివరీలు, 5 వేల మంది కరోనా పేషెంట్లకు డయాలసిస్, 1500 మంది బ్లాక్​ఫంగస్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందజేసిన ఘనత గాంధీ ఆస్పత్రిదేనని కొనియాడారు. అలాగే 650కి పైగా ఐసీయూ బెడ్లలో పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించడం సాధారణ విషయం కాదన్నారు. ఇదంతా గాంధీ మెడికల్ స్టాఫ్ వల్లే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ కు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నర్సింహారావు, డాక్టర్ శోభన్​ బాబు తదితరులు పాల్గొన్నారు.