కరోనా మృతుల్లో 70% మగవాళ్లేనట

కరోనా మృతుల్లో 70% మగవాళ్లేనట
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వల్ల మహిళల కంటే పురుషులే తీవ్రంగా ప్రభావితమయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ పాజిటివ్స్‌‌లో పురుషుల శాతం 63గా ఉందని, 37 శాతం మహిళలకు కరోనా సోకిందని కేంద్ర హెల్త్ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ చెప్పారు. ‘దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 8 శాతం కేసులు 17 ఏళ్ల లోపు వారికి వచ్చాయి. 18-25 ఏళ్ల వయస్సు గ్రూప్ వారిలో 13 శాతం మంది వైరస్‌ ఇన్ఫెక్షన్‌‌కు గురయ్యారు. 26 నుంచి 44 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌‌లో 39 శాతం మంది, 15-60 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో 26 శాతం మందికి కరోనా వచ్చింది. కరోనా మృతుల్లో 70 శాతం మరణాలు పురుషులవే. 45 శాతం మరణాలు 60 ఏళ్ల వయస్సు వారిలో సంభవించాయి’ అని భూషణ్ పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఆరు నెలల తర్వాత 2.7 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. యూకే, సౌతాఫ్రికాల్లో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా మ్యూటెంట్‌‌ను అంతం చేయగల శక్తి ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్స్‌‌కు ఉందన్నారు.