మహిళల స్కీంలో డబ్బులు కొట్టేసిన మగవాళ్లు.. ఆడిట్‎లో బయటపడ్డ అక్రమాలు

మహిళల స్కీంలో డబ్బులు కొట్టేసిన మగవాళ్లు.. ఆడిట్‎లో బయటపడ్డ అక్రమాలు

ముంబై: ఆర్థికంగా వెనకబడిన మహిళల కోసం మహారాష్ట్ర సర్కారు తెచ్చిన లాడ్కీ బహిన్‌‌ పథకంలో అక్రమాలు బయటపడ్డాయి. 21 నుంచి 65 ఏండ్లలోపున్న మహిళల కోసం ఉద్దేశించిన ఈ స్కీమ్‌‌ కింద 14,298 మంది మగవాళ్లు డబ్బు అందుకున్నట్లు తేలింది. పోయినేడాదిలో లాడ్కీ బహిన్‌‌ స్కీమ్‌‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా రూ.21.44 కోట్ల నగదు వీళ్ల ఖాతాల్లో పడినట్లు ప్రభుత్వ ఆడిట్‌‌లో వెల్లడైంది. 2024లో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన మహాయుతి కూటమి.. గెలిచిన తర్వాత స్కీమ్‌‌ను అమల్లోకి తెచ్చింది.

 కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉన్న 21 ఏండ్ల నుంచి 65 ఏండ్లలోపున్న మహిళలకు ఈ స్కీం కింద ప్రభుత్వం నెలకు రూ.1,500 చెల్లిస్తోంది. అయితే, కొందరు మగవాళ్లు తమ పేర్లను మహిళలుగా రిజిస్టర్‌‌‌‌ చేయించుకున్నట్లు బయటపడింది. దీనిపై డిప్యూటీ సీఎం అజిత్‌‌ పవార్‌‌‌‌ స్పందించారు. అక్రమంగా స్కీమ్ ప్రయోజనాలు పొందినవాళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తామన్నారు.

అనర్హులు 27 లక్షల మంది.. 

కుటుంబంలో ఇద్దరు మాత్రమే పథకానికి అర్హులు కాగా, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మహిళలు.. అలా 7.97 లక్షల మంది మహిళలు డబ్బులు పొందినట్లు గుర్తించారు. ఈ రకంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1,196 కోట్ల నష్టం వాటిల్లిందని తేలింది. 65 ఏండ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు తమ వయసును తక్కువగా వేయించుకుని లాడ్కీ బహిన్‌‌ లబ్ధిదారులుగా మారారని, తద్వారా ప్రభుత్వం 431.7 కోట్లు కోల్పోయిందని ఆడిటింగ్‌‌లో వెల్లడైంది.