షాంఘై: షాంఘైలో మంగళవారం ప్రారంభమైన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత పురుషుల కాంపౌండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో మూడో సీడింగ్‌ను దక్కించుకుంది. మాజీ ప్రపంచ చాంపియన్ ఓజాస్ డియోటాలే జట్టుకు నాయకత్వం వహించారు. 711 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు.
సాహిల్ జాదవ్.. ఓజాస్‌తో సమానంగా 711 పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్స్-కౌంట్ ఆధారంగా తర్వాతి స్థానంలో నిలిచారు. కుశాల్ దలాల్ 18వ స్థానంలో నిలవడంతో భారత జట్టు మూడో సీడింగ్‌ను సొంతం చేసుకుంది. అభిషేక్ వర్మ 705 పాయింట్లతో 25వ స్థానానికి పరిమితమై, జట్టు కాంబినేషన్‌లో చోటు కోల్పోయారు.
కానీ వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్లలో ఆయన పాల్గొంటారు. మహిళల కాంపౌండ్ విభాగంలో అదితీ స్వామి 700 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. ప్రగతి (697 పాయింట్లు) 19వ స్థానంలో, జ్యోతి సురేఖ వెన్నం (21వ స్థానం) నిలిచారు. ఈ ముగ్గురి ప్రదర్శనతో భారత మహిళల జట్టు ఐదో సీడింగ్‌ను దక్కించుకుంది.
