ఏసీబీ వలలో మెప్మా ఏడీ యాదగిరిరావు..నివాసంతో పాటు 10 ప్రాంతాల్లో సోదాలు

ఏసీబీ వలలో మెప్మా ఏడీ యాదగిరిరావు..నివాసంతో పాటు 10 ప్రాంతాల్లో సోదాలు
  •     రూ.4.75 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు.. మార్కెట్ విలువ రూ.40 కోట్లపైనే
  •     కిలోన్నర బంగారం, 3 కిలోల వెండి, కార్లు, ప్లాట్లు సహా భారీగా ఆస్తులు
  •     గతంలో జీహెచ్‌‌‌‌ఎంసీ అడిషనల్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన అధికారి

హైదరాబాద్, వెలుగు: మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) అడిషనల్ డైరెక్టర్ నల్లగట్ల యాదగిరి రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. గతంలో జీహెచ్‌‌‌‌ఎంసీ అడిషనల్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉప్పల్ హైకోర్టు కాలనీలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.4.75 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

హైదరాబాద్​లో ఇల్లు, రెండు ఫ్లాట్లు, 12 ప్లాట్లు  

యాదగిరి రావు ఇంట్లో రూ.33.82 లక్షల విలువైన 1.7 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.80 లక్షల విలువైన3 కిలోల వెండి, రూ.73 లక్షల విలువైన రెండు కార్లు, రూ.2.80 లక్షల విలువైన మూడు బైకులు గుర్తించారు. అలాగే రూ.36.08 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ హైకోర్టు కాలనీలో రూ.2 కోట్ల విలువైన జీ+3 రెసిడెన్షియల్ బిల్డింగ్, రూ.1.06 లక్షల విలువైన కమర్షియల్ షాప్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌లో 12 ఓపెన్ ప్లాట్లు రూ.58.63 లక్షలు, ఉప్పల్‌‌‌‌లో రెండు ఫ్లాట్లు రూ.31.36 లక్షల విలువైనవిగా అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో రూ.4.75 లక్షల విలువైన ఇల్లు కూడా గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.30 లక్షల నగదు నిల్వలను ఫ్రీజ్ చేశారు. అనంతరం యాదగిరి రావును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌‌‌‌కు తరలించారు.