15 నెలలుగా జీతాలు లేకున్నా డ్యూటీలు చేస్తున్రు

15 నెలలుగా జీతాలు లేకున్నా డ్యూటీలు చేస్తున్రు

15 నెలలుగా నిలిచిన శాలరీలు

ఆదుకుంటున్న రూ.2వేల సమాఖ్య పైసలు

నిజామాబాద్ జిల్లాలో 293 మంది ఎదురుచూపులు

ఆర్మూర్​, వెలుగు : శాలరీస్ లేకున్నా మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) డ్యూటీలు చేస్తున్నారు. కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ మెప్మా రిసోర్స్ పర్సన్లు 2018 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజులపాటు డ్యూటీలకు వెళ్లకుండా సమ్మెకు దిగారు. సర్కార్ దిగి వచ్చి శాలరీస్ ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని అదే ఏడాది ఆగస్టు 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్పీలు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. కానీ నాలుగు నెలల ఆలస్యంగా శాలరీస్ రావడం షురువయ్యాయి. 2019 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 15 వరకు నాలుగు నెలల 15 రోజుల శాలరీ కలిపి మొత్తం రూ.18వేలు 2019 అక్టోబర్ లో వచ్చింది. 2019 మే, జూన్​ కు సంబంధించిన శాలరీస్ 2020 ఏప్రిల్ లో వచ్చాయి. 2019 జూలై నుంచి ఇప్పటివరకు శాలరీస్ రావాల్సి ఉంది.

15 నెలలుగా ఎదురు చూపులే…

జిల్లాలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్​, భీమ్ గల్ మున్సిపాలిటీల్లో 293 మంది మెప్మా రిసోర్స్​పర్సన్లు ​డ్యూటీలు చేస్తున్నారు. ఆర్పీలు మున్సిపాలిటీ ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తున్నారు. మహిళా సంఘాల డెవలప్​ మెంట్​, హరితహారం, ఇతర సర్వేలతోపాటు రేషన్​ డీలర్ల సమ్మె టైంలో సరుకుల పంపిణీ చేశారు. తమ డ్యూటీలకు తగిన శాలరీస్ లేవంటూ రెండేండ్ల కింద 52 రోజుల పాటు చేసిన సమ్మె ఫలితంగా మెప్మా ఆర్పీలకు ప్రభుత్వం ద్వారా రూ.4వేలు, సమాఖ్య ద్వారా రూ.2వేలు, మొత్తం రూ.6వేలు వేతనం ఇస్తామని జీవో జారీ చేసింది. తమకు కనీస వేతనం వస్తుందని ఆశించిన మెప్మా ఆర్పీలకు కేవలం ఆరు నెలల శాలరీస్ మాత్రమే చేతికిచ్చారు. ఇప్పుడు 15 నెలలుగా శాలరీస్ రావడంలేదు. కుటుంబ పోషణ భారం కావటంతో సమాఖ్య ద్వారా వచ్చే రూ.2వేలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

సర్కార్ నుంచే రావాలి

మెప్మా ఆర్పీలకు 15 నెలలుగా శాలరీస్ రావాల్సి ఉంది. మేము ప్రతి నెలా ఆర్పీల అటెండెన్స్ ​ఎంట్రీ చేసి సీడీఎంఏకు పంపిస్తున్నం. మా వద్ద ఎలాంటి పెండింగ్ ఉంచటం లేదు. శాలరీ పెండింగ్ విషయమే మళ్లీ రిపోర్టు పంపి శాలరీ వచ్చేలా చూస్తం. -రాములు, మెప్మా పీడీ,  నిజామాబాద్.