
- యూరో మారకంలో రూపాయి విలువ పడడమే కారణం
న్యూఢిల్లీ: యూరో మారకంలో రూపాయి విలువ పడడంతో ఇండియాలో తమ కార్ల రేట్లను పెంచుతామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వాహన ధరలను ఒక శాతం నుంచి -1.5 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచిన ఈ కంపెనీ, గత నెలలో రూపాయి యూరోతో 100 వద్ద స్థిరంగా ఉండటంతో మరో ధర పెంపును ప్లాన్ చేస్తోంది.
వడ్డీ రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులపై ఈఎంఐ భారం తగ్గుతుందని, అందువలన ధరల పెంపు ప్రభావం ఉండదని అయ్యర్ అన్నారు. కంపెనీ కొత్త కార్ల అమ్మకాల్లో 80శాతం ఫైనాన్స్ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు. “కారు ధర పెరిగినప్పటికీ, ఈఎంఐల్లో మార్పు లేకుండా ఉండేలా చూస్తున్నాం. ఇది ధరల పెంపు ప్రభావాన్ని తగ్గిస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో లగ్జరీ కార్లకు డిమాండ్ ఉందని, ఆర్థిక వృద్ధితో వీటి కొనుగోలుకు ఆసక్తి పెరుగుతోందని, కరెన్సీ హెచ్చుతగ్గులు కంపెనీ నియంత్రణలో లేవని కొనుగోలుదారులు అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కారణంగా ఉత్పత్తి సమస్యల గురించి అడిగినప్పుడు, సప్లయ్ చెయిన్‌లో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.